breaking news
Modern police system
-
శాస్త్రవేత్తల విజయాలను గుర్తించాలి
అహ్మదాబాద్: పరిశోధన, ఆవిష్కరణల్లో భారత్‌ను ప్రపంచానికి కేంద్ర స్థానంగా మార్చేందుకు కృషి చేయాలని సైంటిస్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పురోగతి కోసం ఆధునిక విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ దేశాల్లో సైంటిస్టుల కృషికి తగిన గుర్తింపు లభిస్తుందని, మన దేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేకుండాపోయిందని విచారం వ్యక్తం చేశారు. మన శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను మనం గుర్తించడం లేదని అన్నారు. భారత శాస్త్రవేత్తల విజయాలు, ఘనతలను గుర్తించి, సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరముందన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం ప్రారంభమైన సెంటర్–స్టేట్ సైన్స్ సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మన పరిశోధనలను స్థానిక స్థాయికి తీసుకెళ్లాలని మోదీ చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల్లో మన దేశాన్ని గ్లోబల్ సెంటర్‌గా మార్చడానికి కలిసి పనిచేయాలన్నారు. విద్యా సంస్థల్లో ఇన్నోవేషన్ ల్యాబ్‌ల సంఖ్య భారీగా పెరగాలన్నారు. ‘‘2015లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో భారత్ స్థానం 81. కేంద్రం కృషి వల్లే ఇప్పుడు 46కు చేరింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకు మాతృభాషల్లో బోధించేలా ప్రయత్నాలు జరగాలి. ప్రపంచస్థాయి ప్రయోగశాలల ఏర్పాటుకు రాష్ట్రాలు ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సహకరిస్తుంది’’ అని ప్రధాని చెప్పారు. -
ప్రజామోద పోలీసింగ్‌కు 9 సూత్రాలు
ఠాణాల వారీగా ప్రచారానికి నిర్ణయం తెలుగు, ఇంగ్లీషుల్లో బోర్డుల ఏర్పాటు సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్న నగర పోలీసులు మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ఆమోదం పొందేలా ఆధునిక పోలీసు వ్యవస్థను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి తొమ్మిది సూత్రాలను ఖరారు చేశారు. వీటిని అన్ని స్థాయిల్లో ఉన్న పోలీసులకు అర్థమయ్యేలా బోర్డులు రూపొందిస్తున్నారు. ‘ప్రజా ఆమోదమే ఆధునిక పోలీసు వ్యవస్థకు పునాది’ పేరుతో తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రూపొందిస్తున్న ఈ బోర్డుల్ని అన్ని ఠాణాలకు పంపిణీ చేస్తున్నారు. వీటిని ఏ కొందరికో మాత్రమే కాకుండా అధికారులు, సిబ్బందితో పాటు ఫిర్యాదుదారులకూ కనిపించేలా ఏర్పాటు చేయనున్నారు. పోలీసుస్టేషన్‌లోని ప్రతి రిసెప్షన్లోనూ ఈ బోర్డులు ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ బోర్డుల ద్వారా ప్రచారం చేయనున్న తొమ్మిది సూత్రాలు ఇవే... ⇒నేరాలను నిరోధించడం, శాంతిభద్రతల్ని పరిరక్షించడమే పోలీసుల ప్రాథమిక లక్ష్యం. ⇒పోలీసు చర్యలకు ప్రజల నుంచి లభిస్తున్న ఆమోదం పైనే వారి విధి నిర్వహణ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ⇒స్వచ్ఛందంగా చట్టాన్ని పాటించేలా ప్రజల్ని చైతన్యపర్చి, అందుకు వారి ఆమోదాన్ని పొందినప్పుడే పోలీసులు నిత్యం వారి నుంచి గౌరవమన్ననలు పొందుతారు. ⇒విధి నిర్వహణలో ఏ స్థాయిలో బలప్రయోగం చేస్తామో... ప్రజల నుంచి లభించే సహాయ సహకరాలు అదే స్థాయిలో తగ్గుతాయి. ⇒ నిస్ఫాక్షికంగా, నిజాయితీగా విధి నిర్వహణ చేస్తేనే ప్రజామోదం, వారి సహకారం లభిస్తుంది. కొద్దిమంది అభిప్రాయానికి అనుగుణంగా పని చేస్తే ఇది సాధ్యం కాదు. ⇒చట్టాన్ని అమలు పరిచే, శాంతిభద్రతలు పునరుద్ధరించే క్రమంలో ప్రజలతో సంప్రదింపులు, సలహాలు, హెచ్చరికలు విఫలమైతేనే అవసరమైన మేరకు బలప్రయోగం చేయాలి. ⇒ ‘ప్రజలే పోలీసులు-పోలీసులే ప్రజలు’. అన్ని వేళల్లోనూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలి. సమాజ క్షేమం, రక్షణ ప్రజల బాధ్యత. ఆ బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించడానికి జీతాలు చెల్లిస్తూ ప్రజలు నియమించుకున్న వ్యవస్థే పోలీసు. ⇒పోలీసులు అన్ని వేళలా తమ చర్యల్ని చట్టప్రకారం తమకు సంప్రదించిన విధులకు మాత్రమే పరిమితమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సందర్భంలోనూ తాము అధికారాలు చలాయిస్తున్నట్లు కనిపించకూడదు. ⇒నేరరహిత, శాంతిభద్రతలతో కూడిన సమాజమే పోలీసు సామర్థ్యానికి కొలమానం. నేరాలను, అశాంతిని ఎదుర్కోడానికి పోలీసులు తీసుకునే చర్యలు మాత్రం సామర్థ్యానికి ప్రతీక కాదు.