డ్వాక్రా వసూళ్లపై విచారణ
పాలకోడేరు: పసుపు, కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలకు ఇస్తున్న సొమ్ములకు కమీషన్లు గుంజుతున్న వైనంపై ‘సాక్షి’లో ప్రచురించిన ‘పిండేస్తున్నారు’ కథనానికి డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు స్పందించారు. దీనిపై విచారణకు ఏరియా కో–ఆర్డినేటర్ సూరజ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కో–ఆర్డినేటర్ సూరజ్ పాలకోడేరు మండలంలో డ్వాక్రా మహిళలను శనివారం విచారించారు. మోగల్లు, పాలకోడేరు తదితర గ్రామాల్లో డ్వాక్రా గ్రూపుల నుంచి రూ.1,300 వసూలు చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై పలువురు మహిళలు ఆయన వద్ద మొరపెట్టుకున్నట్టు తెలిసింది. మరో రెండు రోజులపాటు విచారణ చేస్తామని, సమగ్ర నివేదికను డీఆర్డీఏ పీడీకి అందిస్తామని చెప్పారు. విచారణలో ఐకేపీ సీసీ కుమారి, మండల సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, యానిమేటర్లు, గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.