ఉగ్రవాది ఆరిఫ్ ఉరి అమలుపై స్టే
న్యూఢిల్లీ: ఎర్రకోటపై దాడి చేసిన లష్కరేతోయిబా ఉగ్రవాది మహమ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్‌కు విధించిన ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. తాను ఇప్పటికే 13 ఏళ్లపాటు జైలులో గడిపానని, తనను విడుదల చేయాలని కోరుతూ ఆరిఫ్ చేసుకున్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం... దీనిపై సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
2000వ సంవత్సరం డిసెంబర్ 22న ఎర్రకోటపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇద్దరు జవానులు సహా ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కింది కోర్టు ఆరిఫ్‌కు ఉరిశిక్ష విధించగా... ఢిల్లీ హైకోర్టు దానిని 2007 సెప్టెంబర్ 13న ధ్రువీకరించింది, దీనిని సవాలు చేస్తూ ఆరిఫ్ వేసిన పిటిషన్‌ను 2011 ఆగస్టులో సుప్రీంకోర్టు కొట్టివేసింది కూడా. అయితే తాజాగా.. ఆరిఫ్ సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు చేశాడు. తాను ఇప్పటికే 13 ఏళ్లుగా జైల్లో ఉన్నానని.. ఇప్పటివరకూ తాను శిక్ష కోసం ఎదురుచూస్తూ వేదన అనుభవించానని ఆరిఫ్ సుప్రీంకు తెలిపాడు. దానివల్ల శారీరకంగా, మానసికంగా దెబ్బతిన్నానని.. తనను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసుకున్నాడు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఉరిశిక్ష అమలుపై స్టే ఇస్తూ.. కేంద్రానికి నోటీసులు జారీచేసింది.