బోపన్న కూడా సాధించాడు
మోంటెకార్లో మాస్టర్స్ టోర్నీలో డబుల్స్ టైటిల్ సొంతం
మోంటెకార్లో (మొనాకో): రెండేళ్ల విరామం తర్వాత భారత డబుల్స్ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న ఓ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో తన భాగస్వామి పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే)తో కలిసి బోపన్న డబుల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. 74 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–క్యువాస్ ద్వయం 6–3, 3–6, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో ఏడో సీడ్ ఫెలిసియానో లోపెజ్–మార్క్ లోపెజ్ (స్పెయిన్) జంటను ఓడించింది.
విజేతగా నిలిచిన బోపన్న–క్యువాస్ జోడీకి 2,53,950 యూరోల (రూ. కోటీ 76 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో బోపన్న–క్యువాస్ జోడీ ‘సూపర్ టైబ్రేక్’లో విజయం సాధించడం గమనార్హం. 49 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో డబుల్స్ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా బోపన్న గుర్తింపు పొందాడు. గతంలో మహేశ్ భూపతి (2003లో), లియాండర్ పేస్ (2005లో) ఒక్కోసారి ఈ టైటిల్ గెలిచారు.
బెంగళూరుకు చెందిన 37 ఏళ్ల బోపన్న కెరీర్లో ఇది నాలుగో మాస్టర్స్ సిరీస్ డబుల్స్ టైటిల్. గతంలో అతను మాడ్రిడ్ ఓపెన్‌ను (2015లో ఫ్లోరిన్ మెర్జియాతో) ఒకసారి, పారిస్ ఓపెన్‌ను రెండుసార్లు (2012లో మహేశ్ భూపతితో, 2011లో ఐజామ్ ఖురేషీతో) గెలిచాడు. ఓవరాల్‌గా బోపన్న కెరీర్లో ఇది 16వ డబుల్స్ టైటిల్‌కాగా ఈ ఏడాది రెండోది. చెన్నై ఓపెన్‌లో భారత్‌కే చెందిన జీవన్ నెడుంజెళియన్‌తో కలిసి బోపన్న టైటిల్ సాధించాడు.