‘ఇంగ్లిష్’ టీచర్లకు శిక్షణ
జిల్లాలో 654 పాఠశాలల్లో ఇంగ్లిషు మాధ్యమంలో బోధన
ఈనెల 12 నుంచి.. మూడు విడతలుగా కార్యక్రమం
పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించే విషయమై ఓ అడుగు ముందుకు పడింది. ఇంతకాలం ప్రారంభోత్సవాలకే పరిమితమైన విద్యాశాఖ ఇంగ్లీష్ భాషపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లాలోని 654 పాఠశాలల నుంచి ఇద్దరేసి ఉపాధ్యాయుల చొప్పున శిక్షణ ఇచ్చేందుకు ఈ నెల 12 నుంచి 19 వరకు షెడ్యూల్ రూపొందించింది.
ఇందుకనుగుణంగా ఇంగ్లీష్ బోధన నైపుణ్యాన్ని పొందుపరుస్తు తయారు చేసిన మాడ్యూల్స్ గురువారం మండల వనరుల కేంద్రాలకు చేరాయి. నాలుగైదు మండలాల ఉపాధ్యాయులను ఒక చోట చేర్చి శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఒకటో, రెండో తరగతులకు సంబంధించి సిలబస్ రూపొందించి పుస్తకాలు రూపొందించాల్సి ఉంది.
ప్రభుత్వ బడులను బతికించకునేందుకు ఈ యేడు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ప్రారంభించింది.మెదక్ జిల్లాలో మొత్తం 2940 పాఠశాలలుండగా 654 పాఠశాలల్లో ఈ యేడు ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించారు.అయితే పాఠశాలలను ప్రారంభించినప్పటికీ పుస్తకాలు..కరిక్యులం లేక చాలా చోట్ల చిన్నారులు బడికి రావడం..పోవడం వరకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి.
దీనికి తోడు తెలుగు మీడియం బోధిస్తున్న టీచర్లకు ఇంగ్లీషు భాష బోధన మెలకువలు..నైపుణ్యం లేక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయినప్పటికీ చాలా చోట్ల టీచర్లు తమ సొంత డబ్బులతో ఇంగ్లిషు మీడియం పుస్తకాలు కొనుగోలు చేసి ఉన్న పరిజ్ఞానం మేరకు బోధించారు.
మూడు విడతల శిక్షణ
ఈనెల 12 నుంచి 30 వరకు మూడు విడతలుగా శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.ఈ మేరకు మాడ్యూల్స్ గురువారం ఎమ్మార్సీలను చేరాయి. ఇందుకు అవసరమైన రిసోర్స్ పర్పన్లను నియమించి బోధన మెలకువలు, కమ్యునికేషన్ స్కిల్స్ నేర్పనున్నారు. ఈనెల 12 నుంచి 17 వరకు మొదటి విడత, 19 నుంచి 23 వరకు రెండో విడత, 26 నుంచి 30 వరకు మూడోవిడత శిక్షణ కార్యక్రమాలు 5 రోజుల చొప్పున కొనసాగనున్నాయి.నాలుగేసి మండలాలను ఒక చోట కలిపి శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన బడ్జెట్ను కూడా విడుదల చేశారు.