నెలవారీ బిల్లులు భారం
న్యూఢిల్లీ: ఆహార, వ్యక్తిగత సంరక్షణ (ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తుల ధరల పెంపుతో నెలవారీ షాపింగ్ బిల్లులు గడిచిన రెండు మూడు నెలల్లో పెరిగిపోయాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలు సబ్బులు, బాడీవాష్‌లు మొదలుకొని హెయిర్ ఆయిల్, కాఫీ పౌడర్, నూడుల్స్, ఆటాపై సగటున 2–9 శాతం మేర ధరలను సవరించాయి. హెయిర్ ఆయిల్‌పై ఈ పెంపు 8–11 శాతం మేర ఉంది. కొన్ని రకాల ఆహారోత్పత్తులపై ధరల బాదుడు 3 నుంచి 17 శాతం మధ్య ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కమోడిటీల ధరలు దిగొచ్చిన ఏడాది తర్వాత ఎఫ్ఎంసీజీ సంస్థలు తమ ఉత్పత్తుల విక్రయ ధరలను సవరించడం ఇదే మొదటిసారి. ముడి సరుకుల (తయారీ) వ్యయాలు పెరిగిపోవడంతో తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు 2022, 2023లో ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరలను సవరించడం గమనార్హం. ముఖ్యంగా 2023–24 ఆర్థిక సంవత్సరం వ్యాప్తంగా ధరల పెంపు జోలికి చాలా సంస్థలు వెళ్లలేదు. ఉత్పత్తుల తయారీలోకి వినియోగించే ముడి చమురు, పామాయిల్ ధరలు గతంతో పోలిస్తే తగ్గగా.. పాలు, చక్కెర, కాఫీ, కోప్రా, బార్లే తదితర ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయి. కొన్ని రకాల కమోడిటీల ధరల్లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నందున 2024–25 ఆర్థిక సంవత్సరంలో ధరల సవరణ తప్పదని కంపెనీలు తమ మార్చి త్రైమాసికం ఫలితాల సందర్భంగా సంకేతమిచ్చాయి. మొత్తం మీద ధరల పెంపు సింగిల్ డిజిట్ (ఒక అంకె)కే పరిమితం కావచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎఫ్ఎంసీజీ రంగంపై విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. పెంపు ఇలా.. కొన్ని రకాల హెయిర్ ఆయిల్ ప్యాక్‌లపై మారికో 6 శాతం మేర ధరలు పెంచింది. కోప్రా (ఎండుకొబ్బరి) ధరలు ఇలాగే పెరుగుతూ పోతే, మరో విడత ధరల సవరణ తప్పదన్న సంకేతం ఇచి్చంది. స్నాక్స్ తయారీ సంస్థ బికజీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2–4 శాతం మేర ధరలు పెంచనున్నట్టు తెలిపింది. పోటీ సంస్థల మాదిరే తాము సైతం ధరలను పెంచుతున్నట్టు టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ప్రకటించింది. దిగ్గజ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) గత ఆర్థిక సంవత్సరంలో ధరల పెంపుజోలికి వెళ్లలేదు. కానీ ఇటీవల కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచింది. డవ్ సబ్బుల ధరలను 2 శాతం పెంచడం గమనార్హం. డాబర్ ఇండియా, ఇమామీ కంపెనీలు సింగిల్ డిజిట్ స్థాయిలో ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇక గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సబ్బులపై 4–5 శాతం సవరించింది. సంతూర్ సబ్బుల ధరలను విప్రో సంస్థ 3 శాతం పెంచింది. కోల్గేట్ పామోలివ్ బాడీవాష్ ధరలను కోల్గేట్ సంస్థ సింగిల్ డిజిట్ స్థాయిలో పెంచింది. హెచ్‌యూఎల్ పియర్స్ బాడీ వాష్ ధరలు 4 శాతం ప్రియమయ్యాయి. డటర్జెంట్ బ్రాండ్ల ధరలను హెచ్‌యూఎల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, జ్యోతి ల్యాబ్స్ సంస్థలు 1–10 శాతం స్థాయిలో పెంచాయి. హెచ్‌యూఎల్ షాంపూల ధరలు తక్కువ సింగిల్ డిజిట్ స్థాయిలో (5 శాతంలోపు), చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను 4 శాతం చొప్పున సవరించింది. నెస్లే తన కాఫీ ఉత్పత్తుల ధరలను 8–13 శాతం మేర పెంచింది. మ్యాగి ఓట్స్ నూడుల్స్ ధరలు 17 శాతం పెరిగాయి. ఆశీర్వాద్ హోల్ వీట్ ఆటా ధరలు కూడా పెరిగాయి.