ఎల్జీ నుంచి దోమల్ని తరిమివేసే టీవీలు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ ఎల్జీ తాజాగా ‘మస్కిటో అవే టీవీ’ (దోమల్ని తరిమివేసే టీవీ)ని మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర శ్రేణి రూ.26,900-రూ.47,500గా ఉంది. ఈ టీవీలో అల్ట్రా సోనిక్ పరికరాన్ని అమర్చామని, ఇది ధ్వని తరంగ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుందని, ఈ టెక్నాలజీ దోమల్ని బయటకు పారదోలుతుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా పేర్కొంది.
ఇందులో ఎలాంటి రసాయనాలను ఉపయోగించలేదని, ఈ టీ వీలు మనుషులకు హాని కలిగించే ప్రమాదకరమైన కిరణాలను విడుదల చేయదని తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే టీవీల తయారీ జరిగిందని పేర్కొంది. ‘మస్కిటో అవే టీవీ’లు ఎంపిక చేసిన ఎల్జీ బ్రాండ్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.