వ్యవసాయానికి అగ్రతాంబూలం
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయరంగంలో కొత్త అధ్యయనాన్ని సృష్టిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఏర్పాటైన తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. మంగళవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, దానిపరిధిలోని పరిశోధన కేంద్రాలను, కళాశాలలను ఆయన పరిశీలించారు. వాటి బలోపేతానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థులతో పాటు కళాశాల తరగతిగదిలో కూర్చొని పాఠాలు విన్నారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులు 3 శాతం కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వాటిని 8 శాతానికి పెంచామన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన, బోధన, విస్తరణలు ప్రధానాంశంగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా రైతులకు సాగుఖర్చులు తగ్గించేందుకు దోహదపడాలని సూచించారు. పీజీ విద్యార్థిని మౌనిక ఫర్టిగేషన్ పద్ధతిలో సాగుచేసిన మిరప పంటను మంత్రి పరిశీలించారు.