ఆ'ధనిక' అమ్మలు
‘బ్రహ్మోత్సవం’ చూశారా? హీరో మహేశ్‌బాబు అమ్మ (నటి రేవతి) అందంగా, రిచ్‌గా కనిపించడం గమనించారా? జూన్ 2న రానున్న త్రివిక్రమ్ ‘అ...ఆ...’లోనూ అంతే. హీరోయిన్ సమంత అమ్మగా గ్లామర్‌తో నటి నదియా కనువిందు చేయనున్నారు. రాబోయే నాని ‘జెంటిల్మన్’లో హీరో తల్లిగా రోహిణి, బాలకృష్ణ 100వ చిత్రమైన చారిత్రక కథాచిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో కథానాయకుడి అమ్మగా ఏకంగా ‘డ్రీమ్ గర్ల్’ హేమమాలిని ప్రేక్షకులను అలరించనున్నారు. అవును! మొన్నమొన్నటి దాకా డ్రీమ్గర్ల్స్గా అలరించిన చాలామంది హీరోయిన్లు ఇప్పుడు అమ్మ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. రిచ్‌గా వెలిగిపోతున్న తెలుగు తెరను సూపర్ రిచ్ చేసేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై న్యూ మామ్ హ్యాజ్ ఎరైవ్డ్!
ఆధునిక తరం అమ్మ
ఒకప్పుడు తెలుగు సినిమా అమ్మ పాత్రలంటే కన్నాంబ, ఋష్యేంద్రమణి. కలర్ యుగంలో అంజలీదేవి, పండరీబాయి, అటు పైన అన్నపూర్ణ, శారద... కొత్త సహస్రాబ్ది ప్రారంభం నుంచి తెలుగు సినిమా అమ్మ రూపురేఖలు, భాష, ప్రవర్తన మారిపోయాయి. ఆర్థిక సరళీకరణ అనంతరం వచ్చిన మార్పులకూ, ఆధునిక తరానికీ అనుగుణంగా అమ్మ పాత్రలు మారాయి.‘నిన్నే పెళ్ళాడతా’ (1996)లో హీరో నాగార్జున తన తల్లి నటి లక్ష్మిని ఆత్మీయ స్నేహితురాలిలా పేరు పెట్టి సంబోధించడం అప్పటికి అందరూ నోళ్ళు నొక్కుకున్న వింత, విడ్డూరం.
ఆ తరువాత ‘అమ్మ - నాన్న - ఓ తమిళ అమ్మాయి’ (2003)లో హీరో రవితేజకూ, అమ్మ పాత్రధారిణి జయసుధకూ మధ్య బంధాన్నీ, పరస్పర సంబో ధననీ జనం కొత్తగా చూశారు. ముతక చీర కట్టుకొని, అష్టకష్టాలు పడి కుటుంబభారాన్ని మోస్తూ, తండ్రిని చంపినవాడిపై పగ తీర్చుకో మని హీరోను ప్రేరేపిస్తూ సాగిన అమ్మ పాత్ర ఇవాళ ఖరీదైన డిజైనర్ శారీలో కనిపించడానికి వెనకాడడం లేదు. హీరో, హీరోయిన్ పాత్రల అమ్మ అయినా, అత్త అయినా కూడా దాదాపు హీరోయిన్ అంత స్థాయిలో అందంగా కనిపిస్తోంది.కనుమరుగై పోతున్న ఉమ్మడి కుటుంబాలు, పెరిగిపోతున్న న్యూక్లియర్ ఫ్యామిలీల నేపథ్యంలో ఇవాళ రచయితలు కూడా ఇలాంటి నవీన కాలపు అమ్మ, అత్తల పాత్రల సృష్టికే మొగ్గు చూపుతున్నారు. ‘ఇవాళ తీస్తున్నవన్నీ ధనిక కుటుంబాల కథలే. హీరో, హీరోయిన్ల కుటుంబాల్లో కనీసం ఒకటైనా సూపర్‌రిచ్ ఫ్యామిలీ. సినిమా నేపథ్యం మారడంతో తెరపై కూడా ఆ హంగూ ఆర్భాటం కనిపించాలంటే, సంపన్న తల్లి పాత్రలు, అధునాతనంగా ఉండే అమ్మల్ని చూపించాల్సి వస్తోంది’ అని సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ వివరించారు.
మొన్నటి హీరోయిన్... ఇవాళ్టి అమ్మ!
మారిన ఈ మదర్లీ క్యారెక్టర్ల కోసం దర్శక, రచయితలు నిన్నటి తరం హీరోయిన్లను వెతికారు. అటు గ్లామర్, ఇటు క్రేజ్ ఉండాలంటే వీరినే కొత్త అమ్మ, అత్తలుగా తేవడం తెలివైన పని అనుకు న్నారు. దాంతో నదియా (‘మిర్చి’, ‘బ్రూస్లీ’, ‘అత్తారింటికి దారేది’, రానున్న ‘అ...ఆ...’), సుకన్య (‘శ్రీమంతుడు’), రేవతి (‘లోఫర్’, బ్రహ్మో త్సవం), రోహిణి (‘అలా మొదలైంది’, రానున్న ‘జెంటిల్మన్’), మధు బాల (‘అంతకు ముందు ఆ తరు వాత’, ‘నాన్నకు ప్రేమతో’), ఐశ్వర్య (‘కల్యాణ వైభో గమే’), తులసి (‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’), శరణ్య (‘కొమరం పులి’, ‘మనం’) వంటి ఒకప్పటి హీరోయిన్లు అమ్మ, అత్తమ్మ క్యారెక్టర్లు అందిపుచ్చుకున్నారు.
వీళ్ళకు తోడు జయసుధ, సుహాసిని లాంటి వాళ్ళు ఇప్పుడు టాప్ క్లాస్ తెలుగు సినీ మదర్స్. హీరోయిన్ రమ్యకృష్ణ తన క్రేజ్‌కు తగ్గట్లే, పాత్రలు (‘బాహుబలి’, ‘సోగ్గాడే చిన్నినాయనా’) ఎంపిక చేసుకుంటు న్నారు. కన్నడం నుంచి వచ్చిన పవిత్రాలోకేశ్ (‘సన్నాఫ్ సత్య మూర్తి’, ‘ప్రస్థానం’, ‘రేసుగుర్రం’), చాలా కాలంగా అమ్మ పాత్రలకు స్థిరపడ్డ సుధ, కొత్త తరంలో ప్రగతి లాంటివాళ్ళు ఉండనే ఉన్నారు. ఖుష్బూ, రాధిక, రోజా అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తున్నారు. 2000లలో తొలి రోజుల దాకా హీరోయిన్గా ఒక ఊపు ఊపిన ఒకప్పటి హీరోయిన్ రాశి కొన్నేళ్ళ గ్యాప్ తర్వాత ఈ ఏడాది ‘కళ్యాణ వైభోగమే’తో అమ్మగా మంచి బోణీ కొట్టారు. పెళ్ళి చేసుకొని, తెరకు దూరమైన మీనా ‘దృశ్యమ్’తో అమ్మ పాత్రలకు పచ్చజెండా ఊపారు. సంఘవి తాజాగా అమ్మ పాత్రలకి సిద్ధమంటున్నారు.
పెరిగిన అవకాశాలు, ఆదాయం!
విశేషం ఏమిటంటే - ఈ కొత్త మదర్స్‌కు కాసులు కూడా ఆ రేంజ్‌లోనే కురుస్తున్నాయి. 2000కి ముందు పాపులర్ హీరోయిన్లుగా వెలిగినప్పటి కన్నా ఇప్పుడీ కొత్త మదర్ ఇమేజ్‌లోనే వారికి అవకాశాలు, ఆదాయం మరింత బాగున్నాయి. ‘‘హీరోయిన్గా ఉన్నప్పటి లానే ఇప్పుడూ సెలక్టివ్‌గానే సినిమాలు చేస్తున్నా. అయితే చేస్తు న్నవి తల్లి, అత్త పాత్రలు కాబట్టి మునుపటి ఒత్తిడీ లేదు. పైగా ఈ పాత్రలకి తక్కువ డేట్లే అవసరం. అందుకే ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే సెలెక్టివ్‌గా సినిమాలూ చేయగలుగు తున్నా’’ అని నదియా ‘సాక్షి’తో అన్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకొనే ప్రేక్షకులు కథలో కాకున్నా ఆర్టిస్టుల్లోనైనా తాము ఆశించింది దక్కుతుంటే ఆనందపడక ఏం చేస్తారు! మే లాంగ్ లివ్ ది న్యూ ఏజ్ తెలుగు సినీ మదర్!
- రెంటాల జయదేవ
లెక్కలు మారిపోయాయ్!
చేస్తున్నవి మదర్లీ క్యారెక్టర్లైనా, నిన్నటి తరంలో వెండితెరను ఏలిన పలువురు హీరోయిన్లకు అప్పటి కన్నా ఇప్పుడే ఆదాయం, అవకాశాలు పుష్కలం. ఈ కొత్త అమ్మలు, అత్తల్లో కొందరి పారితోషికం రోజుకు లక్ష రూపాయల నుంచి 2 లక్షల పైనే ఉండడం విశేషం. ఒకప్పుడు సినిమా కథ విని, పాత్ర మొత్తానికీ ఇంత అని పారితోషికం తీసుకునేవారు. దానికి తగ్గట్లే డేట్లూ కేటాయించేవారు. మంచి పాత్ర, నిడివి ఎక్కువున్న పాత్ర అయితే, అవసరమైతే డబ్బు తగ్గించుకొని, ఒకట్రెండు రోజులు అటూ ఇటూ అయినా పట్టించుకోకుండా, ఒప్పుకున్న పాత్రను పూర్తి చేసేవారు. ఆర్టిస్ట్ ఇమేజ్ అవసర మయ్యే చిన్నపాత్ర అయితేనే, ‘మొహమాటం’ కోసం చేసే ఆ పాత్రకు ఎక్కువ డబ్బు తీసుకొనేవారు.
కానీ, ఇప్పుడు పాత్ర ప్రాధాన్యం కన్నా, ఎన్ని రోజులు డేట్స్ ఇవ్వాల్సి వస్తుందనే లెక్కను బట్టే ఆర్టిస్ట్ పారితోషికం తీసుకొనే సంస్కృతి వచ్చింది. ‘రోజుకు ఇంత’ అనే పారితోషికం పద్ధతిని మధ్యవర్తులు తీసుకురావడంతో, ఆర్టిస్టులకు మునుపటి కన్నా ఎక్కువ డబ్బు నిర్మాత చెల్లించాల్సి వస్తోంది. ప్రణాళిక వేసుకున్నట్లుగా షూటింగ్ జరగక, ఒక్క రోజు అదనంగా ఆ ఆర్టిస్ట్‌తో వర్క్ చేయించుకోవాల్సి వచ్చినా, దానికి నిర్మాత మళ్ళీ పే చేయాల్సి వస్తోంది. భారం మోయాల్సి వస్తోంది. కానీ, నవతరం మదర్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు మాత్రం అందమైన అమ్మలుగా తమకు ఏజ్, క్రేజ్, ఇమేజ్ - ఇన్నీ ఉండబట్టే దర్శక, నిర్మాతలు కోరి తమ కోసం వస్తున్నారంటున్నారు.పారితోషికం... రోజుకు లక్షపైనే!
♦ హేమమాలిని (షూటింగ్లో ఉన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’): బాలకృష్ణ 100వ చిత్రంలో హీరోకు చిన్నప్పటి నుంచి గురువుగా నిలిచే, అతి కీలకమైన తల్లి పాత్ర కోసం రూ. 2 కోట్ల దాకా ఇస్తున్నారు.
♦ నదియా (‘మిర్చి’, రానున్న ‘అ..ఆ’): కొత్త తల్లుల్లో ప్రొఫెషనల్, కాస్ట్లీ మదర్. రోజుకు రూ. 2 లక్షలు.
♦ రమ్యకృష్ణ (‘బాహుబలి’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’): రోజుకు 2 లక్షల దాకా! ‘బాహుబలి’లో శివగామి పాత్రపోషణ తర్వాత క్రేజ్ ఇంకా పెరిగింది.
♦ జయసుధ (‘అమ్మ - నాన్న- ఓ తమిళ అమ్మాయి’, ‘బొమ్మరిల్లు’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘బ్రహ్మోత్సవం’): సినిమాకు 10 -12 రోజుల డేట్స్‌కు కనిష్ఠంగా 20 లక్షలు. ఆ పైన రోజుకు లక్ష రూపాయలు.
♦ రేవతి (‘లోఫర్’, ‘బ్రహ్మోత్సవం’): రోజుకు లక్ష రూపాయల దాకా! సినిమాకు 15 నుంచి 20 లక్షలు!
♦ రోహిణి (‘అలా మొదలైంది’, రానున్న నాని ‘జెంటిల్మన్’): రోజుకు 50 - 60 వేల దాకా!
♦ మధుబాల (‘అంతకు ముందు.. ఆ తరువాత’, ‘నాన్నకు ప్రేమతో’): రోజుకు రూ. 75 వేల దాకా!
♦ రాశి (‘కళ్యాణ వైభోగమే’): రోజుకు రూ. 75 వేల దాకా!
♦ ఐశ్వర్య (‘కళ్యాణ వైభోగమే): రోజుకు రూ. 40 -50 వేల దాకా!
♦ పవిత్రాలోకేశ్ (‘సన్నాఫ్ సత్యమూర్తి, ప్రస్థానం, రేసుగుర్రం’లో హీరోల తల్లి): రోజుకు రూ.50-60 వేలు!
♦ ప్రగతి (‘కళ్యాణ వైభోగమే’): రోజుకు రూ. 40 వేల దాకా! ( గణాంకాలన్నీ పరిశ్రమ వర్గాల భోగట్టా )
మదర్ ఆఫ్ ఆల్ ఎక్స్పరిమెంట్స్
విచిత్రం ఏమిటంటే, ప్రస్తుతం హీరోయిన్గా గిరాకీ ఉన్నవాళ్ళు సైతం కథ నచ్చితే, రొటీన్ పాత్రలకు భిన్నంగా అమ్మ పాత్రల ప్రయోగానికీ సిద్ధమవుతున్నారు. క్రేజ్ ఉన్న ఈ ఏజ్‌లోనే యంగ్ మదర్స్‌గా తెరపై కనిపించడానికీ వెనకాడడం లేదు. ఇవాళ్టి టాప్ హీరోయిన్లయిన సమంత, నిత్యా మీనన్లే అందుకు ఉదాహరణ. విక్రమ్ కుమార్ దర్శకత్వంలోని ‘మనం’లో సమంత ఏకంగా నాగచైతన్య భార్యగా, నాగా ర్జునకు తల్లిగా కాసేపు కనిపిస్తారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలోని ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’లో నిత్యామీనన్ ఏకంగా యంగ్ మదర్‌గా, వర్ధమాన హీరోయిన్ తేజస్వికి తల్లి పాత్రలో హుందాగా కనిపించారు.
తాజా ‘24’లో సైతం సూర్య సరసన, చంటిపిల్ల తల్లిగా తెరపై తళుక్కుమన్నారు. ఈ ఏజ్‌లో తల్లి పాత్రలు వేస్తే కెరీర్‌కే దెబ్బ అవుతుందేమోనన్న శంకలు పెట్టుకోకుండా, ఈ తరం హీరోయిన్లు సైతం సాహసించడం విశేషమే. మంచు లక్ష్మీప్రసన్న ఆ మధ్య ‘బుడుగు’లో తల్లి పాత్రలో కనిపించారు. హీరోయిన్ ఇమేజ్ నుంచి ఇంకా పూర్తిగా బయట పడని శ్రీయ కూడా ‘మనం’లో తల్లిగా కనిపించారు. 2015 సంక్రాంతి రిలీజ్ ‘గోపాల... గోపాల’లో వెంకటేశ్ భార్యగా, పిల్లల తల్లి పాత్ర పోషించారు.