విశాఖపట్నం: అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన చిన్నారిపై కన్నతల్లి కర్కశత్వం చూపింది. గోరుముద్దలు తినిపించాల్సిందిపోయి కోపంతో గరిటతో తలపై కొట్టి కడతేర్చింది. ఈ ఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీసీపీ కె.ఆనందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యలమంచిలి గ్రామానికి చెందిన బంగారు స్నేహ (19) అదే గ్రామానికి చెందిన సాయిని ప్రేమించి 2021 వివాహం చేసుకొంది.
అనంతరం వారు విజయవాడలో కాపురం పెట్టారు. వీరికి ఓ పాప సంతానం. ఆ పాప పేరు గీతశ్రీ. కొంతకాలం తర్వాత ఆ దంపతుల మధ్య మనస్పర్థలతో గొడవలు జరగడంతో యలమంచిలి గ్రామానికి చెందిన రమణతో స్నేహ తన కష్టాలు చెప్పుకుంది. అనంతరం ఆ పరిచయం ప్రేమగా మారడంతో మొదటి భర్త సాయిని విడిచి తన 15నెలల కూతురు గీతాశ్రీని తీసుకుని రమణతో వచ్చేసింది. వీరు దువ్వాడ సమీప మంగళపాలెం జేఎన్‌యూఆర్‌ఎం బ్లాక్ నంబర్ – 74 ఫ్లాట్‌లో నివసిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 17న మధ్యాహ్నం పాపకి స్నేహ అన్నం తినిపిస్తుండగా... పాప అల్లరి చేయడంతో కోపంతో గరిట తీసుకుని కుమార్తె తలపై స్నేహ బలంగా కొట్టింది. దీంతో పాపకి అధిక రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయి పడిపోయింది. తీరాచూస్తే చనిపోవడంతో రాత్రి అయ్యాక బ్లాక్ నంబర్ 74 వెనుక ఉన్న ముళ్లపొదల్లో స్నేహ పాతిపెట్టింది.
అనంతరం భారీగా వర్షాలు కురవడంతో అక్కడి మట్టి కరిగిపోవడంతో పైకి తేలిన గీతశ్రీ మృతదేహాన్ని కుక్కలు బయటకు లాగడంతో ఈ హత్యోదంతం శనివారం ఉదయం 11 గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది. చిన్నారి గీతశ్రీ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు దువ్వాడ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలు స్నేహని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏసీపి త్రీనాథ్, దువ్వాడ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు కేసును పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment