Mother daughter died
-
స్కూటీని ఢీకొట్టిన కారు.. తల్లీకూతురు దుర్మరణం
(నల్గొండ) త్రిపురారం : ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసి వస్తున్న యువతితో పాటు ఆమె తల్లిని కారు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శోభన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామానికి చెందిన మేకల సైదమ్మ(35) కుటుంబం మాడుగులపల్లి మండలం గజలాపురంలోని కోళ్ల ఫారంలో పనిచేస్తోంది. కాగా, సైదమ్మ కూతురు మౌనిక (17) ఇటీవల ఇంటర్ పూర్తిచేసింది. పై చదువులకు దరఖాస్తు చేసుకునేందుకు గాను మౌనిక సోమవారం సాయంత్రం తల్లి సైదమ్మ, సమీప బంధువు విష్ణుతో కలిసి స్కూటీపై త్రిపురారం బయలుదేరారు. అక్కడ పని ముగించుకుని రాత్రి 10గంటల ప్రాంతంలో గజలాపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. రోడ్డు దాటుతూ మృత్యుఒడికి.. త్రిపురారం మండల కేంద్రం నుంచి స్కూటీపై బయలుదేరిన ముగ్గురు అనుముల సుశీల నర్సింహారెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా గల జంక్షన్ నుంచి బాబుసాయిపేట వైపు రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలోనాగర్ కర్నూలు జిల్లా కోల్లాపూర్ నుంచి వైజాక్ వైపు వేగంగా వెళ్తున్న కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి వచ్చి క్షతగాత్రులను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సైదమ్మ, మౌనిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వారిని హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చౌటుప్పల్ వద్ద తల్లి, కూతురు మృతిచెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విష్ణు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. కాగా, ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సైదమ్మ, మౌనిక మృతదేహాలకు మంగళవారం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లీకూతురు మృతితో ఆస్పత్రి ఆవరణలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతురాలు సైదమ్మ భర్త రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాదకరంగా జంక్షన్ మండల కేంద్రంలోని అనుముల సుశీల నర్సింహారెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద గల జంక్షన్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. కొన్ని రోజులుగా నిత్యం జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. హాలియా నుంచి మిర్యాలగూడ వెళ్లే రోడ్డుకు కుక్కడం నుంచి వచ్చే వాహనాలు కలుస్తుంటాయి. అయితే రెండూ డబుల్ రోడ్లు కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
భర్త వేధింపులతో విసిగి కూతురుసహా తల్లి సజీవదహనం
ములుగు(గజ్వేల్): కుటుంబకలహాలు రెండు నిండుప్రాణాలను బలితీసుకున్నాయి. ఒకవైపు భర్త వేధింపులు.. మరోవైపు మానసిక వికలాంగురాలైన కూతురుకు పెళ్లి కాదేమోననే బెంగ.. కొంతకాలంగా మానసిక వేదన అనుభవిస్తున్న ఓ తల్లి కూతురుతోసహా నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ములుగు మండలం వాగునూతి గ్రామానికి చెందిన సగ్గు అవిలయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య గంగవ్వ(40)కు జ్యోతి, హారతి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్నకూతురు వివాహం జరగ్గా మానసిక వికలాంగురాలైన పెద్ద కూతురు జ్యోతి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. రెండో భార్యకు కొడుకు, కూతురు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆరునెలల నుంచి అవిలయ్య, గంగవ్వకు మధ్య కుటుంబకలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అవిలయ్య ఆమెను కొట్టడంతో గురువారం ఉదయం 10 గంటలకు తన సోదరుడు మానుక అవిలయ్యకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు అతడు బావకు ఫోన్ చేయగా గంగవ్వ, జ్యోతి కనపడటం లేదని చెప్పాడు. ఆందోళనకు గురైన మానుక అవిలయ్య వారి కోసం వెతకడం ప్రారంభించాడు. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు జప్తిసింగాయిపల్లి అటవీ ప్రాంతంలో నీలగిరి చెట్ల మధ్య కాలినస్థితిలో గంగవ్వ, జ్యోతి మృతదేహాలు కనిపించాయి. అక్కడ సమీపంలోనే గంగవ్వ బంగారు, వెండి అభరణాలు మూటకట్టి ఉన్నాయి. భర్త వేధింపులు భరించలేకనే తన సోదరి గంగవ్వ కూతురితో కలసి నిప్పంటించుకుని బలవన్మరణం చెందిందని మానుక అవిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. గంగవ్వ భర్త అవిలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు దుర్మరణం
-మరో ఇద్దరు పరిస్థితి విషమం భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లికూతురులు అక్కడికక్కడే మరణించగా ఒకే కుటుంబానికి చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వలిగొండ మండలంలోని వెల్వర్తి శివారులోని దుర్గమ్మ ఆలయం సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని రెడ్లరేపాకకు చెందిన చుక్క నారాయణ కూతురుకు సంబంధం మాట్లాడడానికి మొగిలిపాకకు ఆటోలో వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెడ్లరేపాకకు చెందిన ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న చుక్క యాదయ్య భార్య ఎల్లమ్మ (55), ఆమె కూతురు పహిల్వాన్పురంకు చెందిన దుబ్బ స్వామి బార్య దుబ్బ పద్మ (35) అక్కడికక్కడే మృత్యువాత పడగా ఆటోలో ఉన్న దుబ్బ పోషమ్మ, కందుల రాములమ్మ, చుక్క మమత, చుక్క పుష్పలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108లో భువనగిరి ఏరియా వైద్యశాలకు తరలించారు. పోషమ్మ, రాములమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మరో మహిళ చుక్క మమత, డ్రైవర్ చుక్క పోషయ్యను మండలకేంద్రంలోని లక్ష్మణ్ ఆస్పత్రికి, చుక్క నారాయణ, ఆయన భార్య పరదేశమ్మ , కందుల నర్సింహ, దుబ్బ లక్ష్మమ్మ, చుక్క గౌరమ్మలను మండలకేంద్రంలోని సాయికిరణ్ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు మృతదేహాలను పోస్ట్మార్టమ్ నిమిత్తం రామన్నపేట వైద్యశాలకు తరలించారు. ఢీ కొట్టిన ఆటో వెల్వర్తికి చెందినదిగా పలువురు అనుకుంటున్నారు.