Mother, Daughter Killed In Road Accident In Nalgonda | Car Hits Bike - Sakshi
Sakshi News home page

స్కూటీని ఢీకొట్టిన కారు.. తల్లీకూతురు దుర్మరణం

Published Wed, Aug 24 2022 8:04 AM | Last Updated on Wed, Aug 24 2022 9:34 AM

Mother Daughter Killed In Accident At Nalgonda - Sakshi

(నల్గొండ) త్రిపురారం : ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి వస్తున్న యువతితో పాటు ఆమె తల్లిని కారు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా  త్రిపురారం మండల కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శోభన్‌ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామానికి చెందిన మేకల సైదమ్మ(35) కుటుంబం మాడుగులపల్లి మండలం గజలాపురంలోని కోళ్ల ఫారంలో పనిచేస్తోంది. కాగా, సైదమ్మ కూతురు మౌనిక (17) ఇటీవల ఇంటర్‌ పూర్తిచేసింది. పై చదువులకు దరఖాస్తు చేసుకునేందుకు గాను మౌనిక సోమవారం సాయంత్రం తల్లి సైదమ్మ, సమీప బంధువు విష్ణుతో కలిసి స్కూటీపై త్రిపురారం బయలుదేరారు. అక్కడ పని ముగించుకుని రాత్రి 10గంటల ప్రాంతంలో గజలాపురానికి తిరుగు ప్రయాణమయ్యారు.

రోడ్డు దాటుతూ మృత్యుఒడికి..
త్రిపురారం మండల కేంద్రం నుంచి స్కూటీపై బయలుదేరిన ముగ్గురు అనుముల సుశీల నర్సింహారెడ్డి ఫంక్షన్‌ హాల్‌ ఎదురుగా గల జంక్షన్‌ నుంచి బాబుసాయిపేట వైపు రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలోనాగర్‌ కర్నూలు జిల్లా కోల్లాపూర్‌ నుంచి వైజాక్‌ వైపు వేగంగా వెళ్తున్న కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి వచ్చి క్షతగాత్రులను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సైదమ్మ, మౌనిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వారిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చౌటుప్పల్‌ వద్ద తల్లి, కూతురు మృతిచెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విష్ణు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. కాగా, ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సైదమ్మ, మౌనిక మృతదేహాలకు మంగళవారం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లీకూతురు మృతితో ఆస్పత్రి ఆవరణలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతురాలు సైదమ్మ భర్త రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

ప్రమాదకరంగా జంక్షన్‌
మండల కేంద్రంలోని అనుముల సుశీల నర్సింహారెడ్డి ఫంక్షన్‌ హాల్‌ వద్ద గల జంక్షన్‌ ప్రమాదకరంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. కొన్ని రోజులుగా నిత్యం జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. హాలియా నుంచి మిర్యాలగూడ వెళ్లే రోడ్డుకు కుక్కడం నుంచి వచ్చే వాహనాలు కలుస్తుంటాయి. అయితే రెండూ డబుల్‌ రోడ్లు కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement