తల్లి ఆశీస్సులు తీసుకున్న మోదీ
అహ్మదాబాద్: దేశానికి ప్రధాని అయినా ....అమ్మకు మాత్రం ఆయన కొడుకే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఉదయం తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. మోడీ నేడు 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీనగర్లోని తల్లిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆమె కుమారుడికి మిఠాయి తినిపించారు. ప్రధాని ..తల్లితో కొద్దిసేపు ముచ్చటించారు.
గతంలో కూడా మోడీ చాలాసార్లు తన పుట్టినరోజున స్వయంగా వచ్చి తల్లి ఆశీర్వాదాలు తీసుకునేవారు. పుట్టిన రోజు సందర్భంగా మోదీకి బీజేపీ అగ్రనాయకులు, నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు మోదీ తన తల్లిని కలిసేందుకు ఎలాంటి భద్రత లేకుండా కేవలం ఒక కారులో మోదీ గాంధీనగర్ లోని ఆమె నివాసానికి వెళ్లారు.
కాగా శుక్రవారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లీ, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, గుజరాత్ కేబినేట్, రాష్ట్ర బీజేపీ కేడర్, కార్యకర్తలు ఎయిర్ పోర్టుకు చేరుకుని ఆయనకు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గాంధీనగర్ లోని రాజ్ భవన్ లో రాత్రి బస చేశారు. అయితే, మోదీ ఎలాంటి ప్రసంగం చేయకపోవడంతో కార్యకర్తలు నొచ్చుకున్నట్లు తెలిసింది.