టీనేజీ బాలికలను రక్షించిన పోలీసులు: తల్లి అరెస్ట్
థానే: మహారాష్ట్ర థానే మునిర్పాద ప్రాంతంలోని వ్యభిచార గృహాల నుంచి ఇద్దరు మైనర్ బాలికలను రక్షించినట్లు పోలీసు ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. అనంతరం వారిని స్వచ్చంధ సంస్థకు తరలించినట్లు తెలిపారు. అందుకు సంబంధించి వారి తల్లిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఆమె వద్ద నుంచి రూ. 4 వేల నగదుతోపాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
అలాగే మహిళల అక్రమ రవాణతోపాటు పలు కేసులు బాలిక తల్లిపై నమోదు చేసినట్లు ఉన్నతాధికారి వివరించారు. ఈ నెల 8వ తేదీని దాయ్గఢ్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారిలో బాలికల తల్లి కూడా ఉందని పోలీసులు చెప్పారు. అయితే తమను వ్యభిచారంలోకి దిగాలంటూ తల్లి తమను బలవంతం చేస్తున్నట్లు సదరు టీనేజీ బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వాళ్ల తల్లిని అదుపులోకి తీసుకున్నారు.