పర్వతారోహకులు మంటల్లో కాలిపోయారు
బీజింగ్: చైనాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని పర్వతారోహణ చేస్తున్న ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పర్వతారోహణ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతానికి నిప్పు అంటుకోవడం వల్ల ఈ ప్రాణ నష్టం సంభవించింది. చైనాలోని దాలియన్ అనే నగరంలో దాహేయ్ అనే పర్వతం ఉంది. దీనికి దిగువ భాగంతోపాటు కొండమీదుగా పెద్దపెద్ద అటవీ వనాలున్నాయి.
ఈ పర్వతాన్ని ఎక్కేందుకు తరచూ పర్వతారోహకులు వెళుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు పర్వతారోహణ చేస్తున్న సమయంలో మంటలు అంటుకోగా అందులో చిక్కుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన ప్రాంతానికి దాదాపు 300 మంది అగ్ని మాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.