సాహసశిఖరమా.. వీడ్కోలు
► అశ్రునయనాల మధ్య మస్తాన్‌బాబు అంతిమయాత్ర
► ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
► మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, స్నేహితులు హాజరు
► అభిమానులతో కిక్కిరిసిన ఖనన ప్రాంతం
సంగం : అశ్రునయనాల మధ్య, ప్రభుత్వ లాంచనాలతో పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలు శనివారం మండలంలోని గాంధీజనసంఘంలో ఘనంగా జరిగాయి. భారీగా తరలివచ్చిన అభిమానులు, స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు ఆయనకు తుదివీడ్కోలు పలికారు. ఏడు ఖండాల్లోని ఏడు పర్వతాలెక్కి గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన మల్లి మస్తాన్‌బాబు ఆండీస్ పర్వతరోహణకు వెళ్లి అదృశ్యమై శుక్రవారం నాటికి నెల రోజులైంది. అదృశ్యమైనా నాటి నుంచి మస్తాన్‌బాబు జాడ కోసం తోటి పర్వతారోహకులతో పాటు అర్జెంటీనా, చిలీ, భారతదేశం తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూసింది.
అల్పోష్ణస్థితి కారణంతోనే మస్తాన్‌బాబు శిఖరానికి 800 మీటర్ల ఎత్తులో గుడారంలో మృతిచెందాడన్న వార్తవిని ప్రపంచమంతా ఒక్కసారిగా శోకసంద్రంలోకి మునిగిం ది. గుండెలవిసేలా రోదించిన మస్తాన్‌బాబు త ల్లి సుబ్బమ్మతో పాటు విదేశీయురాలు నాన్సీ, సోదరి, సోదరులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. చివరిచూపును చూడాలన్న మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మ కోరిక మేరకు మృతదేహం శుక్రవారం నాటికి (సరిగ్గా నెల రోజులకు) స్వగ్రామానికి చేరింది. సాహస శిఖరానికి అర్జెంటీనా, చిలీ దేశాలు, తోటి పర్వతారోహకులు తుది వీడ్కోలును పలికి భారతదేశానికి మృతదేహాన్ని తరలించారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో పాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాష్ట్రమంత్రులు పొంగూరు నారాయణ, రావెల కిషోర్‌బాబు, పల్లె రఘునాథ్‌రెడ్డి, కామినేని శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతంరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కిలివేటి సంజీవయ్య చేరుకుని మస్తాన్ బాబు మృతదేహానికి నివాళులర్పించారు. కలెక్టర్ జానకితో పాటు ఎస్పీ గజరావు భూపాల్ మస్తాన్‌బాబు అంత్యక్రియలకు సంబంధించి ముందు నుంచే సిబ్బందికి సూచనలిస్తూ, వారు స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు.
కార్యక్రమంలో ఉప మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్ నాయకులు రూప్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధనుంజయరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు దేవసహాయం, ఎంపీపీ కామాక్షమ్మ, సర్పంచ్ మానికల సుజాత, కన్నబాబు, బుజిరెడ్డి, మెట్టుకూరు వాసుదేవరెడ్డి, సూరి మదన్‌మోహన్‌రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, రఘునాధ్‌రెడ్డి పాల్గొన్నారు.
పర్వతారోహణను ప్రోత్సహించాలి
పర్వతారోహణను ప్రోత్సహించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. మస్తాన్‌బాబుకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన మాట్లాడారు. పర్వతారోహణ కూడా ఒక క్రీడలాంటిదేనని, పర్వతారోహణను, పర్వతారోహకులను కూడా ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తై శిఖరాలను 172 రోజుల్లోనే అధిరోహించి గిన్నీస్‌బుక్ రికార్డు నెలకొల్పి తొలి భారతీయుడిగా నిలిచిన మల్లి మస్తాన్‌బాబు నాడు గుర్తించకపోవడం బాధాకరమన్నారు.
మట్టిలో మాణిక్యం మస్తాన్‌బాబు
మట్టిలో మాణిక్యం మల్లి మస్తాన్‌బాబు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మస్తాన్‌బాబు అంత్యక్రియల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మస్తాన్‌బాబుకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. తనది పక్కగ్రామమైన పడమటి పాళెంమని, ఎదురుగా ఉన్న గ్రామంలోని ఓ వ్యక్తి ప్రపంచస్థాయికి ఎదగడం ఆనందంగా ఉందని తెలిపారు.
భావితరాలకు స్ఫూర్తి మస్తాన్‌బాబు
మల్లి మస్తాన్‌బాబు జీవితం భావితరాలకు స్ఫూర్తి అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ప్రచారంపైనే దృష్టి పెట్టే రోజుల్లో దేశ ఖ్యాతికోసమే పాటుపడిన వ్యక్తి మస్తాన్‌బాబు అని అన్నారు. అసామాన్య ప్రతిభను చాటి, సామాన్యుడిగా ఉన్న ప్రతిభాశాలి అన్నారు. సింహపురి ఆణిముత్యం మస్తాన్‌బాబు అన్నారు.
ఖండాతరాలకు దేశ ఖ్యాతిని చాటాడు
ఏడు ఖండాల్లోని ఏడు పర్వతాలను ఎక్కి భారతదేశ కీర్తిని ఖండాతరాలకు చాటిన ధీరుడు మస్తాన్‌బాబు అని నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. మస్తాన్‌బాబు జీవించి ఉన్నంతవరకు ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ఆండీస్ పర్వతారోహణతో దేశఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటాలన్న లక్ష్యంతో పర్వతారోహణ చేశాడన్నారు. ప్రకృతి అనుకూలించ మృతిచెందడం బాధాకరమన్నారు. మస్తాన్‌బాబు మృతి తీరని లోటని ఆయన తెలిపారు.