మస్తాన్‌బాబుకు భారతరత్న ఇవ్వాలి
సంగం: పర్వతారోహణలో అనేక రికార్డుల్ని బద్దలుకొట్టి జాతికి గర్వకారణంగా నిలిచిన ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబుకు భారతరత్న అవార్డు ప్రకటించాలని ఆయన సోదరి డాక్టర్ మస్తానమ్మ డిమాండ్ చేశారు. గత ఏడాది అర్జెంటీనా పర్వతశ్రేణుల్లో ప్రాణాలుకోల్పోయిన మస్తాన్‌బాబు ప్రథమ వర్ధంతి బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ఆయన స్వగ్రామమైన గాంధీజనసంఘంలో నిర్వహించారు. తొలుత మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మ, సోదరి దొరసానమ్మ, ఆత్మకూరు ఆర్డీఓ ఎం.వెంకటరమణలు పలువురు అభిమానులతో కలిసి మస్తాన్‌బాబు సమాధి వద్ద జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో డాక్టర్ దొరసానమ్మ మాట్లాడుతూ మల్లి మస్తాన్‌బాబు మృతిచెంది ఏడాది గడిచినా తాము సమాధి వద్ద ఆయన పేరును లిఖించలేదని పేర్కొన్నారు. 37 పర్వతాలు అధిరోహించి మస్తాన్‌బాబు భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని, ఆయన కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం భారతరత్న ప్రకటిస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. ఆ నమ్మకంతోనే భారతరత్న ప్రకటించిన అనంతరం పేరుకు ముందు ఆ పదాన్ని ఉంచుతూ సమాధి వద్ద లిఖించాలని అనుకున్నానని వివరించారు.
తానెప్పుడు మస్తాన్‌బాబును తమ్మునిగా భావించలేదని, ఓ భారతీయునిగా గుర్తించామని వివరించారు. ఎంతో కష్టతరమైన పర్వతారోహణకు మస్తాన్‌బాబు సిద్ధమైనప్పుడు ఓ భారతీయుడిగా పేరు రావాలనే ప్రోత్సహించామని తెలిపారు. పర్వతాలు అధిరోహించడం ఎంత కష్టమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో తన తమ్ముడు మృతిచెందిన ఆండీస్‌లోని సెర్రోట్రెస్ క్రోసెస్ పర్వతాన్ని స్వయంగా అధిరోహించానన్నారు. ఒక్క పర్వతం ఇంత కష్టమైతే 37 పర్వతాలు అధిరోహించడం ఎంత కష్టతరమో, ప్రపంచంలో మల్లి మస్తాన్‌బాబుకొక్కడికే అది సాధ్యమైందని కొనియాడారు.