Bharataratna
-
ఘంటసాలకు భారతరత్న వచ్చే వరకు కృషి చేద్దాం
అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌తో శంక నేత్రాలయ (యూఎస్ఏ) మరో నిర్విరామంగా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ ఘంటసాల గారి పాటలు విని పెరిగామని, వారి లేని లోటుని ఎవరు భర్తీ చేయలేరని అని అన్నారు. ఘంటసాల పాటలలోని వైవిధ్యాన్ని వివరించారు. ముఖ్యంగా ఒక శ్యామలా దండకం, శివశంకరి వంటి పాటలు ఇంకో వెయ్యేళ్ల తర్వాత కూడా ఎవరు ఘంటసాల లాగా పాడలేరని తెలిపారు. గిన్నిస్ బుక్ పురస్కార గ్రహీత కలైమామణి డాక్టర్ పార్వతి రవి ఘంటసాల మాట్లాడుతూ మనందరి ప్రయత్నాలు సఫలమై త్వరలోనే ఘంటసాలకి భారతరత్న రావాలని ఆకాంక్షించారు. ఇతర వక్తలు మాట్లాడుతూ విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలన్నింటినీ ఏకతాటిపై తెచ్చి ఘంటసాలకు భారతరత్న వచ్చేంతవరకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమెరికా నుంచి ఆపి (ఏఏపీఐ)అధ్యక్షులు డా. అనుపమ గోటిముకుల, విద్యావేత్త, ఆవిష్కర్త డా. బి కె కిషోర్, సేవా ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు స్వదేష్ కటోచ్, బ్రూనై నుంచి తెలుగు సమాజం అధ్యక్షులు వెంకట రమణ (నాని), బోత్సవాన నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ బోత్సవాన అధ్యక్షులు వెంకట్ తోటకూర, మారిషస్ నుంచి ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్, తెలుగు మహాసభ ఆర్గనైజర్ సీమాద్రి లచ్చయ్య తదితరులు పాల్గొని ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 73 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుండి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుండి ఆదిశేషు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కావలసిన సహకారాన్ని ఘంటసాల కృష్ణ కుమారి అందిస్తున్నారు. ఉగాది పర్వదిన వసంత నవరాత్రులు సందర్భంగా ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు. -
మస్తాన్‌బాబుకు భారతరత్న ఇవ్వాలి
సంగం: పర్వతారోహణలో అనేక రికార్డుల్ని బద్దలుకొట్టి జాతికి గర్వకారణంగా నిలిచిన ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబుకు భారతరత్న అవార్డు ప్రకటించాలని ఆయన సోదరి డాక్టర్ మస్తానమ్మ డిమాండ్ చేశారు. గత ఏడాది అర్జెంటీనా పర్వతశ్రేణుల్లో ప్రాణాలుకోల్పోయిన మస్తాన్‌బాబు ప్రథమ వర్ధంతి బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ఆయన స్వగ్రామమైన గాంధీజనసంఘంలో నిర్వహించారు. తొలుత మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మ, సోదరి దొరసానమ్మ, ఆత్మకూరు ఆర్డీఓ ఎం.వెంకటరమణలు పలువురు అభిమానులతో కలిసి మస్తాన్‌బాబు సమాధి వద్ద జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో డాక్టర్ దొరసానమ్మ మాట్లాడుతూ మల్లి మస్తాన్‌బాబు మృతిచెంది ఏడాది గడిచినా తాము సమాధి వద్ద ఆయన పేరును లిఖించలేదని పేర్కొన్నారు. 37 పర్వతాలు అధిరోహించి మస్తాన్‌బాబు భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని, ఆయన కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం భారతరత్న ప్రకటిస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. ఆ నమ్మకంతోనే భారతరత్న ప్రకటించిన అనంతరం పేరుకు ముందు ఆ పదాన్ని ఉంచుతూ సమాధి వద్ద లిఖించాలని అనుకున్నానని వివరించారు. తానెప్పుడు మస్తాన్‌బాబును తమ్మునిగా భావించలేదని, ఓ భారతీయునిగా గుర్తించామని వివరించారు. ఎంతో కష్టతరమైన పర్వతారోహణకు మస్తాన్‌బాబు సిద్ధమైనప్పుడు ఓ భారతీయుడిగా పేరు రావాలనే ప్రోత్సహించామని తెలిపారు. పర్వతాలు అధిరోహించడం ఎంత కష్టమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో తన తమ్ముడు మృతిచెందిన ఆండీస్‌లోని సెర్రోట్రెస్ క్రోసెస్ పర్వతాన్ని స్వయంగా అధిరోహించానన్నారు. ఒక్క పర్వతం ఇంత కష్టమైతే 37 పర్వతాలు అధిరోహించడం ఎంత కష్టతరమో, ప్రపంచంలో మల్లి మస్తాన్బాబుకొక్కడికే అది సాధ్యమైందని కొనియాడారు. -
భారతరత్నాలు... వివాదాలు!
సంపాదకీయం అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించినప్పుడల్లా ఏదో ఒక వివాదం రేకెత్తడం మన దేశంలో రివాజు. ఈసారి ఆ పురస్కారాన్ని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, పండిట్ మదన్ మోహన్ మాలవీయలకు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడ్డాక అదే కొనసాగింది. వాజపేయికి భారతరత్న ఇవ్వడంపై ఎవరూ అభ్యంతరం వ్యక్తంచేయలేదు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో రాజకీయంగా ఎందరితో విభేదించినా వాజపేయి అంటే అందరికీ గౌరవం, మన్నన. ఆయన వ్యక్తిత్వం అటువంటిది. హిందుత్వ సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా నమ్మే బీజేపీకి నేతృత్వంవహించినప్పుడైనా, ఆ పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కారుకు ప్రధానిగా సారథ్యంవహించినప్పుడైనా తాను అనుకున్నది చెప్పడంలో ఆయన ఎప్పుడూ తడబడలేదు. తప్పును తప్పని ఎత్తిచూపడానికి సందేహించలేదు. బాబ్రీ మసీదు విధ్వంసం సమయంలోగానీ, గుజరాత్ మత ఘర్షణలప్పుడుగానీ వాజపేయి తన అభిప్రాయాలను దాచుకోలేదు. సాధారణంగా కవులకు ఉండే సున్నిత మనస్తత్వంతోపాటు సెక్యులర్ విలువలను పరిరక్షించాలన్న తపన ఇందుకు కారణం కావొచ్చు. భారత-పాకిస్థాన్‌లమధ్య దౌత్య సంబంధాల మెరుగుకు కృషి చేసి అందుకోసం లాహోర్‌కు బస్సుయాత్ర చేసినప్పుడు రాజనీతిజ్ఞుడిగా ఆయన పలువురి ప్రశంసలు అందుకున్నారు. విపక్ష నేతగా ఉన్నప్పుడైనా, ప్రధానిగా ఉన్నప్పుడైనా పార్లమెంటులో వాజపేయి ప్రసంగిస్తే సభ మొత్తం నిశ్శబ్దమయ్యేది. ఆయన చేసే కవితాత్మక ప్రసంగాలు, వ్యక్తిగతంగా ఆయనపై అన్ని పక్షాలవారికీ ఉన్న ఆదరాభిమానాలు అందుకు కారణం. కనుకనే వాజపేయికి భారతరత్న ఇవ్వడాన్ని కాంగ్రెస్ సైతం స్వాగతించింది. మాలవీయ విషయంలో మాత్రం చనిపోయినవారికి ఇన్నేళ్ల తర్వాత ఎందుకివ్వాలన్న ప్రశ్న తలెత్తింది. అది ఎవరో లేవనెత్తిన ప్రశ్న కాదు... బీజేపీ సీనియర్ నేత లు వాజపేయి, అద్వానీలకు సన్నిహితంగా మెలిగి 2009 వరకూ ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సుధీంద్ర కులకర్ణి! జాతీయోద్యమ కాలంనాటి నాయకులకు మరణానంతరం భారతరత్న ఇచ్చే సంప్రదాయానికి మాలవీయతో ముగింపు పలకాలని ఆయన ట్వీట్ చేశారు. ఇంచుమించు అదే రకమైన అభిప్రాయాన్ని చరిత్రకారుడు రామచంద్రగుహ కూడా వ్యక్తం చేశారు. మదన్ మోహన్ మాలవీయ జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. దేశ పౌరుల్లో జాతీయ విలువలు పెంపొందాలంటే చదువు అవసరమని విశ్వసించడంతోపాటు కోట్లాదిమంది ప్రజలను పేదరికంనుంచి విముక్తుల్ని చేయాలంటే విజ్ఞానశాస్త్రం వారి అవసరాలను తీర్చేలా ఉండాలని ఆయన భావించారు. అందుకోసం ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ అలా రూపుదిద్దుకున్నదే. ఆనాటికున్న బొంబాయి, కలకత్తా, మద్రాస్ యూనివర్సిటీలు అనుబంధ కళాశాలలతో, కేవలం పట్టాలు ప్రదానం చేసే విశ్వవిద్యాలయాలుగా ఉంటే ఆయన ఎంతో ముందు చూపుతో విద్యార్థులకు హాస్టల్ వసతి సైతం ఉండే ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీ స్థాపన కోసం ఆయన ఎంతగా తపించారంటే అందుకోసం తన న్యాయవాద వృత్తిని సైతం త్యజించారు. ఒక వ్యక్తి కృషితో యూనివర్సిటీ రూపుదిద్దుకున్న సందర్భం అప్పటికీ, ఇప్పటికీ అదొక్కటే. మహాత్మా గాంధీ ఆ యూనివర్సిటీ ప్రాంగణంనుంచే తొలి ఉపన్యాసం చేశారంటారు. 4,000 ఎకరాల ప్రాంగణంలో 30,000 మంది విద్యార్థులతో అనేకానేక రకాల కోర్సులతో, సంస్థలతో అలరారే ఆ యూనివర్సిటీ మాలవీయ దార్శనికతకు, దూరదృష్టికి నిదర్శనం. కులతత్వానికి, దళితులకు దేవాలయ ప్రవేశాన్ని నిరాకరించడానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మాలవీయది. అందుకే ఆయనను ‘మహామనా’(మహా మనీషి)గా సంబోధించేవారు. భారతరత్న పురస్కారానికి దేశంలో ఇంకా అనేకమంది అర్హులున్నారన్నది కొందరి వాదన. అందులో అవాస్తవమేమీ లేదు. ఉదాహరణకు పీవీ నరసింహారావు దేశం ఆర్థికంగా గడ్డు స్థితిలో ఉన్నప్పుడు ప్రధాని పదవి చేపట్టి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభ తీర్మానం కూడా చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత ఎన్టీరామారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండు చాలా పాతది. వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ మద్దతుపై ఆధారపడిన సమయంలో కూడా ఎన్టీఆర్‌కు ఆ పురస్కారం లభించడానికి చంద్రబాబు తగినంతగా కృషిచేయలేదన్న అపవాదు కూడా ఉంది. నిరుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు భారతరత్న ప్రకటించినప్పుడు హాకీలో దేశానికి కీర్తిప్రతిష్టలు ఆర్జించిపెట్టిన స్వర్గీయ ధ్యాన్‌చంద్‌ను విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే, దివంగత నేత కాన్షీరామ్‌కు ఇవ్వాలని బీఎస్పీ నేత మాయావతితోపాటు వివిధ పార్టీల్లోని దళిత నేతలు ఎప్పటినుంచో కోరుతున్నారు. గతంలో ఎంపికైనవారిలో ఎందరో వివాదాస్పద వ్యక్తులున్నారు. అలాగే వినోబా భావే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటివారికి మరణించిన ఎన్నో ఏళ్ల తర్వాతగానీ ఈ అత్యున్నత పురస్కారం లభించలేదు. భారతరత్న కోసం ఎంపికయ్యేవారికి ఉండాల్సిన నిర్దిష్టమైన అర్హతలను నిర్ధారించకపోవడం, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపించడం, కనీసం ఎంపిక కోసమంటూ ఒక కమిటీ అయినా లేకపోవడం ఇలాంటి వివాదాలకు మూలం. అధికారంలో ఉన్నవారి అభీష్టానికి అనుగుణంగా ఎంపికలున్నంతకాలం ఇవి తప్పకపోవచ్చు. ఇప్పుడు విమర్శలొచ్చిన నేపథ్యంలోనైనా ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించి ఒక కొత్త ఒరవడికి నాంది పలికితే అందరూ హర్షిస్తారు. -
టిడిపికి ఇప్పుడే తెల్లారింది!
తెలుగుదేశం పార్టీకి ఇప్పుడే తెల్లారింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరే విషయంలో అనేక విమర్శలు తలెత్తడంతో ఆ పార్టీలో ఇప్పుడే కదలిక వచ్చింది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఈరోజు జరిగిన ఏపి మంత్రి మండలి సమావేశంలో తీర్మానించారు. అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ సంచనాలు సృష్టించిన ఘనుడు ఎన్టీఆర్. సినిమా రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజకీయ రంగంలో తెలుగు జాతి ఖ్యాతిని దశదిశల వ్యాపింపజేసిన నేత. అటువంటి నేతకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం భారత రత్న ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి ఆ పార్టీలోనే వున్నారు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారుగా కూడా ఆయన ఉన్నారు. ఇన్ని అనుకూలతలు ఉన్న పరిస్థితులలో ఎన్టీఆర్‌కు భారతరత్న రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతటి సువర్ణ అవకాశం ఉన్న సమయంలో టిడిపి అసలు ప్రయత్నాలే చేయలేదు. భారతరత్న అవార్డు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన జాబితాలో. ఎన్టీఆర్ పేరే లేదు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గతంలో పార్టీ మహానాడులో భారతరత్న అవార్డు కోసం ఎన్టీఆర్ పేరు పంపించాలని తీర్మానం చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పద్మ అవార్డుల కోసం ప్రతిపాదించిన జాబితాలో ఎన్టీఆర్ పేరు భారతరత్నకు సిఫారసు చేయకపోవడం అందరికి విస్మయం కలిగించింది. భారతరత్నకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదన చేయలేదు. దీంతో దివంగత ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు దక్కే అవకాశం లేదని ఆయన అభిమానులు బాధ వ్యక్తం చేశారు. ప్రతిపక్షం కూడా ఈ అంశాన్ని వేలెత్తి చూపింది. ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇస్తే, నిబంధనల మేరకు ఆ అవార్డును ఆయన భార్య లక్ష్మీపార్వతి అందుకోవలసి వస్తుంది. అలా ఆమె అవార్డు అందుకోవడం ఇష్టంలేక పంపలేదన్న వార్తలు వినవచ్చాయి. ఇందుకు స్పందిస్తూ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇస్తే, దానిని అందుకోవడానికి తాను వెళ్లనని లక్ష్మీపార్వతి ప్రకటించారు. ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం ప్రభుత్వం సిఫారసు చేయాలని ఆమె కోరారు. అటు అభిమానుల నుంచి, ఇటు ప్రతిపక్షం నుంచి కూడా విమర్శలు రావడంతో చేసేదిలేక ముందుగా జాబితాలో పేర్కొనకపోయినప్పటికీ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పుడు తీర్మానం చేసింది. ఈ రోజు ఏపి మంత్రి మండలి మూడు తీర్మానాలను ఆమోదించింది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఢిల్లీలో స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని ఒక తీర్మానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంపై అభినందిస్తూ మరో తీర్మానం చేశారు. ** -
భారతరత్న ఇవ్వకుంటే పార్లమెంట్ ఎదుట ధర్నా
శ్రీకాళహస్తి : తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటిన దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. లేకుంటే పార్లమెంట్ ఎదుట ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించారు. శుక్రవారం లక్ష్మీపార్వతి శ్రీకాళహస్తి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె రాహు కేతు పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం లక్ష్మీపార్వతి విలేకర్లతో మాట్లాడుతూ తెలుగు జాతికి, పేదల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమం పధకాలు అమలు చేశారన్నారు. -
దొంగ నాటకాలు ఆపి భారతరత్న ఇప్పించండి
* ఎన్టీఆర్, వైఎస్సార్ ఆశయాలకోసం పనిచేస్తా * గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ, న్యూస్‌లైన్ : టీడీపీ నాయకులు దొంగనాటకాలు ఆపి ఇప్పటికైనా మహానటుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించేలా చూడాలని వైఎస్సార్ సీపీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) డిమాండు చేశారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సినీ రంగంలో ఎదురులేని నటుడుగా ఎదిగి.. పేద, బడుగు, బలహీనవర్గాల కోసం పార్టీని స్థాపించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. ఇప్పటివరకు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకుండా టీడీపీ నేతలు దొంగనాటకాలు ఆడారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా భారతరత్న ఇప్పించాలని డిమాండు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ఉన్నందున భారతరత్న ఇవ్వాలని కోరారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్, వైఎస్సార్ ఆశయాల కోసం తాను పనిచేస్తానని చెప్పారు. -
సిఎన్ఆర్ రావుకు దక్కిన దేశ అత్యున్నత గౌరవం
సైన్స్‌లో విశేష సేవలు చేసినందుకు ప్రధాని సాంకేతిక సలహాదారుడు, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్.రావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్న పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది. భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించిన సచిన్ టెండూల్కర్‌తో కలిపి రావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. రావు పూర్తి పేరు చింతామణి నాగేశ రామచంద్ర రావు. బెంగళూరులో జూన్ 30, 1934న నాగేశ్వరరావు, నాగమ్మ దంపతులకు జన్మించిన రావు సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ రంగాలలో ప్రముఖ శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడయ్యారు. ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడ్ గురించిన ఆయన పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు శాస్త్ర, సాంకేతిక సలహాదారులుగా ఉన్నారు. మైసూర్ విశ్వవిద్యాలయంలో 1951లో డిగ్రీ పూర్తి చేశారు. కాశీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీపూర్తి చేశారు. 1958లో ఫుర్డ్యూ యూనివర్సిటీలో పిహెచ్డి అందుకున్నారు. కాన్పూరు ఐఐటిలో దాదాపు 13 ఏళ్లు రసాయశాస్త అధ్యాపడుకుడగా పని చేశారు. 84-94 మధ్య కాలంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆక్స్ఫర్డ్, కేండ్రిడ్జి, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశారు. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్ సంస్థకు గౌరవాధ్యక్షుడుగా పని చేశారు. సి.ఎన్.ఆర్.రావు ప్రతిభను గుర్తించి దేశవిదేశాలలోని పలు సంస్థలు అనేక అవార్డులు ఇచ్చి గౌరవించాయి. ఆయనది 60 ఏళ్ల పరిశోధనా ప్రస్థానం. 45కి పైగా పుస్తకాలు రాశారు. 1500పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు అందజేసింది. దేశవిదేశాల నుంచి ఆయన 150కి పైగా పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ లు ఇచ్చాయి. సి.ఎన్.ఆర్.రావు అందుకున్న అవార్డులు: 2000- హ్యూస్ మెడల్ - రాయల్ సొసైటీ 2004 - భారత ప్రభుత్వం నుండి ఇండియా సైన్సు అవార్డు పొందిన మొదటి వ్యక్తి 2005 - డాన్ డేవిడ్ ప్రైజ్ (Tel Aviv University) 2005 - ఫ్రాన్సు ప్రభుత్వ అవార్డు 1968 - శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు ఇంకా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ రాయల్ సొసైటీ (లండన్), ఫ్రెంచ్ అకాడమీ, జపాన్ అకాడమీ, పోంటిఫికల్ అకాడమీ అవార్డులు ఆయన అందుకున్నారు. -
'భారతరత్న' నా తల్లికి అంకితం: సచిన్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తనకు ప్రకటించిన 'భారతరత్న' అవార్డును తన తల్లి రజనికి అంకితం చేస్తున్నట్లు సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ ఈరోజే తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను సచిన్ టెండూల్కర్, సైన్స్‌లో విశేష సైవలు అందించిన ప్రధాని సాంకేతిక సలహాదారుడు సిఎన్ఆర్ రావులకు ఈరోజు భారత తర్న ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత పురస్కారం తనకు ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి సచిన్ ధన్యవాదాలు తెలిపారు. భారతరత్న తనకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. అంతకు ముందు క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా సచిన్ మాట్లాడుతూ క్రికెట్ వైపు నడిపించిన తల్లికి కృతజ్ఞతలు తెలిపాడు. అమ్మ ప్రార్థనలే తనని ఈస్థాయికి చేర్చాయని చెప్పారు. ఏ వ్యక్తి అయినా గొప్పవాడు అయ్యేందుకు కుటుంబమే కారణమన్నారు.