అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌తో శంక నేత్రాలయ (యూఎస్‌ఏ) మరో నిర్విరామంగా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ ఘంటసాల గారి పాటలు విని పెరిగామని, వారి లేని లోటుని ఎవరు భర్తీ చేయలేరని అని అన్నారు. ఘంటసాల పాటలలోని వైవిధ్యాన్ని వివరించారు. ముఖ్యంగా ఒక శ్యామలా దండకం, శివశంకరి వంటి పాటలు ఇంకో వెయ్యేళ్ల తర్వాత కూడా ఎవరు ఘంటసాల లాగా పాడలేరని తెలిపారు.
గిన్నిస్ బుక్ పురస్కార గ్రహీత కలైమామణి డాక్టర్ పార్వతి రవి ఘంటసాల మాట్లాడుతూ మనందరి ప్రయత్నాలు సఫలమై త్వరలోనే ఘంటసాలకి భారతరత్న రావాలని ఆకాంక్షించారు. ఇతర వక్తలు మాట్లాడుతూ విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలన్నింటినీ ఏకతాటిపై తెచ్చి ఘంటసాలకు భారతరత్న వచ్చేంతవరకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అమెరికా నుంచి ఆపి (ఏఏపీఐ)అధ్యక్షులు డా. అనుపమ గోటిముకుల, విద్యావేత్త, ఆవిష్కర్త డా. బి కె కిషోర్, సేవా ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు స్వదేష్ కటోచ్, బ్రూనై నుంచి తెలుగు సమాజం అధ్యక్షులు వెంకట రమణ (నాని), బోత్సవాన నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ బోత్సవాన అధ్యక్షులు వెంకట్ తోటకూర, మారిషస్ నుంచి ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్, తెలుగు మహాసభ ఆర్గనైజర్ సీమాద్రి లచ్చయ్య తదితరులు పాల్గొని ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 73 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుండి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుండి ఆదిశేషు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కావలసిన సహకారాన్ని ఘంటసాల కృష్ణ కుమారి అందిస్తున్నారు.
ఉగాది పర్వదిన వసంత నవరాత్రులు సందర్భంగా ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment