దొంగ నాటకాలు ఆపి భారతరత్న ఇప్పించండి
* ఎన్టీఆర్, వైఎస్సార్ ఆశయాలకోసం పనిచేస్తా
* గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
గుడివాడ, న్యూస్‌లైన్ : టీడీపీ నాయకులు దొంగనాటకాలు ఆపి ఇప్పటికైనా మహానటుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించేలా చూడాలని వైఎస్సార్ సీపీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) డిమాండు చేశారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సినీ రంగంలో ఎదురులేని నటుడుగా ఎదిగి.. పేద, బడుగు, బలహీనవర్గాల కోసం పార్టీని స్థాపించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు.
ఇప్పటివరకు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకుండా టీడీపీ నేతలు దొంగనాటకాలు ఆడారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా భారతరత్న ఇప్పించాలని డిమాండు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ఉన్నందున భారతరత్న ఇవ్వాలని కోరారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్, వైఎస్సార్ ఆశయాల కోసం తాను పనిచేస్తానని చెప్పారు.