సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయం లాంటిదని, ప్రజల సొమ్ము లూటీ చేసిన వారెవరినీ వదలబోమని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) హెచ్చరించారు. టీడీపీ తమకు అసలు ప్రత్యర్థే కాదని, ఆ పార్టీ నేతలను వేధించాల్సిన అవసరం లేదని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా సీఎం జగన్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన పెద్దవాళ్లంతా కాలగర్భంలో కలిసి పోయారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు, లోకేష్ బతికుండగా దించలేరని, 2024లోనూ ప్రజలు టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పటం ఖాయమని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
అప్పుడే అప్పగిస్తే మరింత ముందుకు...
రాష్ట్ర ప్రజలంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసిన తరువాత 2014లోనే వైఎస్ జగన్‌కు అధికారాన్ని అప్పగించి ఉంటే రాష్ట్రం మరింత ముందుకు వెళ్లి ఉండేదని భావిస్తున్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మానవత్వం, పేదల అభివృద్ధే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్ నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింత ముందుకు వెళ్లి ఉండేదని అనుకుంటున్నారు. ఆ రోజు టీడీపీకి ఓటు వేసిన బీసీలు, ఆఖరికి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అదే భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెండేళ్లలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా పేదలు, అట్టడుగు వర్గాలకు తానున్నాననే భరోసా కల్పించారు. అక్షరాలా రూ.1,31,000 కోట్ల సంపదను అన్ని వర్గాలకు పంచి మేలు చేకూర్చిన ఏకైక సీఎం జగన్.
అధికారం ఇస్తే దోచిపెట్టిన చంద్రబాబు...
అనుభవజ్ఞుడని నమ్మి 2014లో చంద్రబాబుకు ప్రజలు అధికారమిస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చి తన వాళ్లకు దోచిపెట్టారు. చంద్రబాబు సహకారంతో అక్రమాలకు పాల్పడిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కరోనా విపత్కర కాలంలో అంతా సమైక్యంగా పనిచేస్తుంటే జూమ్ యాప్ వేదికగా చంద్రబాబు రాజకీయాలే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రజలను విశ్వసించడు. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడిని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. వాజ్‌పేయి హయాంలో ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా దుర్మార్గంగా అడ్డుపడ్డారు. ఆయనకు ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా ఇంకా వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడిని రాజకీయంగా సమాధి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త చరిత్ర
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి 70 సంవత్సరాల చరిత్ర ఒక ఎత్తు కాగా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ సీఎం జగన్ చేపట్టిన చర్యలు మరో ఎత్తు. ఈ రెండేళ్లలోనే 16 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడుతున్నాం. దేశంలో 108 అంబులెన్సులు ఎన్ని ఉన్నాయో తెలియదు గానీ రాష్ట్రంలోమాత్రం ప్రతి మండలానికి ఏర్పాటు చేశాం. పేదలు వైద్యానికి ఇబ్బంది పడకూడదనే తపనతో సీఎం జగన్ పనిచేస్తున్నారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు రూ.10 లక్షలు చొప్పున సాయం ప్రకటించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment