నీకు దమ్ముంటే నాపై పోటీచేయి | kodali Nani challenge to the chandrababu | Sakshi
Sakshi News home page

నీకు దమ్ముంటే నాపై పోటీచేయి

Published Mon, Nov 16 2015 1:36 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

నీకు దమ్ముంటే నాపై పోటీచేయి - Sakshi

నీకు దమ్ముంటే నాపై పోటీచేయి

చంద్రబాబుకు నాని సవాల్
 
 గుడివాడ: ‘చంద్రబాబూ.. నీకు దమ్ముంటే 2019 ఎన్నికల్లో గుడివాడలో నాపై పోటీచేసి గెలువు.. నేను ఓడిపోతే రాష్ట్రం వదిలి వెళ్లిపోతా... నాపై గెలవలేక నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఇటువంటి చిల్లర పనులు చేయటం మానుకో..’ అని ఎమ్మెల్యే కొడాలి నాని  హెచ్చరించారు. గుడివాడలో వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసుల్ని, ఇంటి యజమానిని పావులుగా వాడుకుని అరెస్టులు చేయటంపై ఆయన ఘాటుగా స్పందించారు. పోలీస్‌స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. తాను శాసనసభ్యుడి కార్యాలయంగా వినియోగించుకుంటున్న భవనానికి ప్రతినెలా అద్దె చెల్లిస్తున్నానని, అయితే కార్యాలయంపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బొమ్మ ఉండటం భవనం యజమానికి ఇష్టం లేదని, ఖాళీ చేయాలని ఇటీవలి చెప్పారని తెలిపారు.

త్వరలోనే ఖాళీ చేస్తామని కూడా చెప్పామన్నారు. శనివారం రాత్రి 9.30 గంటలకు గుడివాడలో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదివారం ఉదయం 9.30 గంటలకు  పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిం చారు. గుడివాడలో తనపై గెలవలేక చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ‘సిగ్గుమాలిన రాజకీయాలు మానుకుని రాష్ట్రం అభివృద్ధిపై దృష్టి పెట్టు.. ఇటువంటి ఉడత ఊపులకు నేనుగానీ, మా అధినేత జగన్‌గానీ భయపడే ప్రసక్తి లేదు’ అని చంద్రబాబునుద్దేశించి స్పష్టం చేశారు.  చట్టప్రకారం తనకున్న హక్కులతో త్వరలోనే అక్కడ నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తానన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడటం వైఎస్సార్ రక్తంలోగానీ, ఆయన కుమారుడు జగన్ రక్తంలోగానీ, తమ రక్తంలోగానీ లేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement