సిఎన్ఆర్ రావుకు దక్కిన దేశ అత్యున్నత గౌరవం
సైన్స్లో విశేష సేవలు చేసినందుకు ప్రధాని సాంకేతిక సలహాదారుడు, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్.రావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్న పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది. భారత క్రికెట్కు విశేష సేవలు అందించిన సచిన్ టెండూల్కర్తో కలిపి రావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. రావు పూర్తి పేరు చింతామణి నాగేశ రామచంద్ర రావు. బెంగళూరులో జూన్ 30, 1934న నాగేశ్వరరావు, నాగమ్మ దంపతులకు జన్మించిన రావు సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ రంగాలలో ప్రముఖ శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడయ్యారు. ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడ్ గురించిన ఆయన పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు శాస్త్ర, సాంకేతిక సలహాదారులుగా ఉన్నారు.
మైసూర్ విశ్వవిద్యాలయంలో 1951లో డిగ్రీ పూర్తి చేశారు. కాశీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీపూర్తి చేశారు. 1958లో ఫుర్డ్యూ యూనివర్సిటీలో పిహెచ్డి అందుకున్నారు. కాన్పూరు ఐఐటిలో దాదాపు 13 ఏళ్లు రసాయశాస్త అధ్యాపడుకుడగా పని చేశారు. 84-94 మధ్య కాలంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు డైరెక్టర్గా ఉన్నారు. ఆక్స్ఫర్డ్, కేండ్రిడ్జి, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్గా పని చేశారు. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్ సంస్థకు గౌరవాధ్యక్షుడుగా పని చేశారు.
సి.ఎన్.ఆర్.రావు ప్రతిభను గుర్తించి దేశవిదేశాలలోని పలు సంస్థలు అనేక అవార్డులు ఇచ్చి గౌరవించాయి. ఆయనది 60 ఏళ్ల పరిశోధనా ప్రస్థానం. 45కి పైగా పుస్తకాలు రాశారు. 1500పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు అందజేసింది. దేశవిదేశాల నుంచి ఆయన 150కి పైగా పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ లు ఇచ్చాయి.
సి.ఎన్.ఆర్.రావు అందుకున్న అవార్డులు:
2000- హ్యూస్ మెడల్ - రాయల్ సొసైటీ
2004 - భారత ప్రభుత్వం నుండి ఇండియా సైన్సు అవార్డు పొందిన మొదటి వ్యక్తి
2005 - డాన్ డేవిడ్ ప్రైజ్ (Tel Aviv University)
2005 - ఫ్రాన్సు ప్రభుత్వ అవార్డు
1968 - శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు
ఇంకా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ రాయల్ సొసైటీ (లండన్), ఫ్రెంచ్ అకాడమీ, జపాన్ అకాడమీ, పోంటిఫికల్ అకాడమీ అవార్డులు ఆయన అందుకున్నారు.