భారతరత్నాలు... వివాదాలు! | Bharataratnas ... controversies! | Sakshi
Sakshi News home page

భారతరత్నాలు... వివాదాలు!

Published Thu, Dec 25 2014 12:04 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

మదన్ మోహన్ మాలవీయ-అటల్ బిహారీ వాజపేయి - Sakshi

మదన్ మోహన్ మాలవీయ-అటల్ బిహారీ వాజపేయి

సంపాదకీయం
 అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించినప్పుడల్లా ఏదో ఒక వివాదం రేకెత్తడం మన దేశంలో రివాజు. ఈసారి ఆ పురస్కారాన్ని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, పండిట్ మదన్ మోహన్ మాలవీయలకు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడ్డాక అదే కొనసాగింది. వాజపేయికి భారతరత్న ఇవ్వడంపై ఎవరూ అభ్యంతరం వ్యక్తంచేయలేదు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో రాజకీయంగా ఎందరితో విభేదించినా వాజపేయి అంటే అందరికీ గౌరవం, మన్నన. ఆయన వ్యక్తిత్వం అటువంటిది. హిందుత్వ సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా నమ్మే బీజేపీకి నేతృత్వంవహించినప్పుడైనా, ఆ పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కారుకు ప్రధానిగా సారథ్యంవహించినప్పుడైనా తాను అనుకున్నది చెప్పడంలో ఆయన ఎప్పుడూ తడబడలేదు. తప్పును తప్పని ఎత్తిచూపడానికి సందేహించలేదు. బాబ్రీ మసీదు విధ్వంసం సమయంలోగానీ, గుజరాత్ మత ఘర్షణలప్పుడుగానీ వాజపేయి తన అభిప్రాయాలను దాచుకోలేదు. సాధారణంగా కవులకు ఉండే సున్నిత మనస్తత్వంతోపాటు సెక్యులర్ విలువలను పరిరక్షించాలన్న తపన ఇందుకు కారణం కావొచ్చు. భారత-పాకిస్థాన్‌లమధ్య దౌత్య సంబంధాల మెరుగుకు కృషి చేసి అందుకోసం లాహోర్‌కు బస్సుయాత్ర చేసినప్పుడు రాజనీతిజ్ఞుడిగా ఆయన పలువురి ప్రశంసలు అందుకున్నారు. విపక్ష నేతగా ఉన్నప్పుడైనా, ప్రధానిగా ఉన్నప్పుడైనా పార్లమెంటులో వాజపేయి ప్రసంగిస్తే సభ మొత్తం నిశ్శబ్దమయ్యేది. ఆయన చేసే కవితాత్మక ప్రసంగాలు, వ్యక్తిగతంగా ఆయనపై అన్ని పక్షాలవారికీ ఉన్న ఆదరాభిమానాలు అందుకు కారణం. కనుకనే వాజపేయికి భారతరత్న ఇవ్వడాన్ని కాంగ్రెస్ సైతం స్వాగతించింది. మాలవీయ విషయంలో మాత్రం చనిపోయినవారికి ఇన్నేళ్ల తర్వాత ఎందుకివ్వాలన్న ప్రశ్న తలెత్తింది. అది ఎవరో లేవనెత్తిన ప్రశ్న కాదు... బీజేపీ సీనియర్ నేత లు వాజపేయి, అద్వానీలకు సన్నిహితంగా మెలిగి 2009 వరకూ ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సుధీంద్ర కులకర్ణి! జాతీయోద్యమ కాలంనాటి నాయకులకు మరణానంతరం భారతరత్న ఇచ్చే సంప్రదాయానికి మాలవీయతో ముగింపు పలకాలని ఆయన ట్వీట్ చేశారు. ఇంచుమించు అదే రకమైన అభిప్రాయాన్ని చరిత్రకారుడు రామచంద్రగుహ కూడా వ్యక్తం చేశారు.

 మదన్ మోహన్ మాలవీయ జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. దేశ పౌరుల్లో జాతీయ విలువలు పెంపొందాలంటే చదువు అవసరమని విశ్వసించడంతోపాటు కోట్లాదిమంది ప్రజలను పేదరికంనుంచి విముక్తుల్ని చేయాలంటే విజ్ఞానశాస్త్రం వారి అవసరాలను తీర్చేలా ఉండాలని ఆయన భావించారు. అందుకోసం ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ అలా రూపుదిద్దుకున్నదే. ఆనాటికున్న బొంబాయి, కలకత్తా, మద్రాస్ యూనివర్సిటీలు అనుబంధ కళాశాలలతో, కేవలం పట్టాలు ప్రదానం చేసే విశ్వవిద్యాలయాలుగా ఉంటే ఆయన ఎంతో ముందు చూపుతో విద్యార్థులకు హాస్టల్ వసతి సైతం ఉండే ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీ స్థాపన కోసం ఆయన ఎంతగా తపించారంటే అందుకోసం తన న్యాయవాద వృత్తిని సైతం త్యజించారు. ఒక వ్యక్తి కృషితో యూనివర్సిటీ రూపుదిద్దుకున్న సందర్భం అప్పటికీ, ఇప్పటికీ అదొక్కటే. మహాత్మా గాంధీ ఆ యూనివర్సిటీ ప్రాంగణంనుంచే తొలి ఉపన్యాసం చేశారంటారు. 4,000 ఎకరాల ప్రాంగణంలో 30,000 మంది విద్యార్థులతో అనేకానేక రకాల కోర్సులతో, సంస్థలతో అలరారే ఆ యూనివర్సిటీ మాలవీయ దార్శనికతకు, దూరదృష్టికి నిదర్శనం. కులతత్వానికి, దళితులకు దేవాలయ ప్రవేశాన్ని నిరాకరించడానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మాలవీయది. అందుకే ఆయనను ‘మహామనా’(మహా మనీషి)గా సంబోధించేవారు.

 భారతరత్న పురస్కారానికి దేశంలో ఇంకా అనేకమంది అర్హులున్నారన్నది కొందరి వాదన. అందులో అవాస్తవమేమీ లేదు. ఉదాహరణకు పీవీ నరసింహారావు దేశం ఆర్థికంగా గడ్డు స్థితిలో ఉన్నప్పుడు ప్రధాని పదవి చేపట్టి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభ తీర్మానం కూడా చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత ఎన్టీరామారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండు చాలా పాతది. వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ మద్దతుపై ఆధారపడిన సమయంలో కూడా ఎన్టీఆర్‌కు ఆ పురస్కారం లభించడానికి చంద్రబాబు తగినంతగా కృషిచేయలేదన్న అపవాదు కూడా ఉంది. నిరుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు భారతరత్న ప్రకటించినప్పుడు హాకీలో దేశానికి కీర్తిప్రతిష్టలు ఆర్జించిపెట్టిన స్వర్గీయ ధ్యాన్‌చంద్‌ను విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే, దివంగత నేత కాన్షీరామ్‌కు ఇవ్వాలని బీఎస్‌పీ నేత మాయావతితోపాటు వివిధ పార్టీల్లోని దళిత నేతలు ఎప్పటినుంచో కోరుతున్నారు. గతంలో ఎంపికైనవారిలో ఎందరో వివాదాస్పద వ్యక్తులున్నారు. అలాగే వినోబా భావే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటివారికి మరణించిన ఎన్నో ఏళ్ల తర్వాతగానీ ఈ అత్యున్నత పురస్కారం లభించలేదు. భారతరత్న కోసం ఎంపికయ్యేవారికి ఉండాల్సిన నిర్దిష్టమైన అర్హతలను నిర్ధారించకపోవడం, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపించడం, కనీసం ఎంపిక కోసమంటూ ఒక కమిటీ అయినా లేకపోవడం ఇలాంటి వివాదాలకు మూలం. అధికారంలో ఉన్నవారి అభీష్టానికి అనుగుణంగా ఎంపికలున్నంతకాలం ఇవి తప్పకపోవచ్చు. ఇప్పుడు విమర్శలొచ్చిన నేపథ్యంలోనైనా ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించి ఒక కొత్త ఒరవడికి నాంది పలికితే అందరూ హర్షిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement