పాలీహౌస్ రైతులకు త్వరలో సబ్సిడీ
చేవెళ్ల, న్యూస్‌లైన్: పాలీహౌస్(గ్రీన్ హౌస్) రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, వారికి త్వరలో సబ్సిడీ అందజేస్తామని ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ ఎం.పాపిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని సాగర్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ స్కూల్లో పాలీహౌస్ రైతులకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో సాగర్ విద్యాసంస్థల సౌజన్యంతో ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పాపిరెడ్డి మాట్లాడుతూ.. నాలుగైదేళ్లుగా పాలీహౌస్‌లు, షేడ్నెట్ల ద్వారా పూలు, కూరగాయల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని రైతులు ఉద్యాన పంటల సాగుపై విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. గత ఏడాది ఉద్యాన పంటల రైతులకు సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ.150 కోట్లతో బడ్జెట్ రూపొందించిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్‌ను రెట్టింపు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. సబ్సిడీ కోసం పాలీహౌస్ రైతులు పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి కారణం నిధులు లేకపోవడమేనని ఆయన స్పష్టంచేశారు.
ఈ ఫిబ్రవరి నెలాఖరులోగా సబ్సిడీ విడుదల కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రైతులకు పాలీహౌస్ సాగులో మరింత అవగాహన కల్పించడానికి దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటుగా విదేశాలకు కూడా తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామని పాపిరెడ్డి పేర్కొన్నారు. కేవలం ఫ్లోరికల్చర్(పూలు) కాకుండా కూరగాయల సాగుపై కూడా రైతులు దృష్టిసారించాలని సూచించారు. గత సంవత్సరం కూరగాయల విత్తనాలకు సబ్సిడీ కోసం ఉద్యాన శాఖ ద్వారా రూ.12 కోట్లు కేటాయించామని తెలిపారు.
కూరగాయలను మార్కెటింగ్ చేసుకోవడానికి ఆసక్తిగల రైతులకు, సొసైటీలకు 60 వాహనాలను రూ.2 లక్షల సబ్సిడీపై అందజేశామని, ఈ సంవత్సరం మరో 56 వాహనాలను ఇస్తున్నామని చెప్పారు. పూల రైతులకు గిట్టుబాటు ధర కోసం హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో త్వరలో వేలం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వ్యవసాయాన్ని ఎంటర్ప్రైజెస్, బిజినెస్‌గా మార్చాలి: రాంపుల్లారెడ్డి
సంప్రదాయ వ్యవసాయంతో ప్రస్తుతం లాభాలు గడించలేమని, హైటెక్, ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని కళాశాల కార్యదర్శి, కేంద్ర వ్యవసాయశాఖ మాజీ సంయుక్త కార్యదర్శి రాంపుల్లారెడ్డి సూచించారు. పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.
వ్యవసాయాన్ని ఎంటర్‌ప్రైజెస్‌గా, వ్యాపార రంగంగా మారిస్తేనే పెరిగిన పెట్టుబడులను తట్టుకొని లాభాలను గడించే అవకాశం ఉంటుందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో స్థిరీకరణ ఉండాలన్నారు. రైతు నిపుణులను తయారుచేయడానికే సాగర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ స్కూల్‌ను స్థాపించామని పేర్కొన్నారు.
సబ్సిడీ 80 శాతానికి పెంచాలి
పాలీహౌస్‌లు వేసుకున్న, వేయాలనుకునే రైతుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించి సబ్సిడీని అందజేయాలని తెలంగాణ రీజియన్ పాలీ హౌస్ రైతుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు.
సబ్సిడీని కూడా 50 శాతం నుంచి 80 శాతానికి పెంచాలన్నారు. సదస్సులో ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఉద్యాన శాఖ రంగారెడ్డి జిల్లా ఏడీ ఉమాదేవి, డివిజన్ ఏడీ సంజయ్‌కుమార్, విస్తరణాధికారి రాఘవేందర్, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, డెరైక్టర్ ఆగిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పలు జిల్లాల రైతులు పాల్గొన్నారు.