నీలం రంగులోకి మారుతున్న కుక్కలు
సాక్షి, ముంబై :
ముంబైలో కుక్కలు నీలం రంగులోకి మారడం సంచలనం సృష్టిస్తోంది. కుక్కలకు ఎవరో కావాలనే రంగులు వేసినట్టు ఉన్నా, అవి రంగుమారడం వెనక మానవ తప్పిదాలే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రంగు మారిన కుక్కలు మరికొన్ని రోజుల్లో మృతిచెందనున్నాయని తెలియడంతో ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గత కొన్ని రోజులుగా ముంబైలో రంగుమారిన లక్షణాలు కుక్కల్లో విపరీతంగా పెరిగిపోవడంతో ముంబై కార్పొరేషన్ దీనిపై దృష్టిసారించింది. నీలం రంగు కుక్కల వ్యవహారంపై మహారాష్ట్రా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు ముంబై యానిమల్ ప్రొటెక్షన్ సెల్ ఫిర్యాదు చేసింది. తలోజ పారిశ్రామిక ప్రాంతం నుంచి వచ్చే వ్యర్థాల వల్లే కసాడి నది కలుషితం కావడం.. ఆ నీటిని కుక్కలు తాగడంతో రంగులు మారుతున్నాయని ఫిర్యాదులో పేర్కొంది.
ముంబై మహా నగరం చుట్టూ ఉన్న ఫార్మా, కెమికల్, ఫుడ్ ప్రాసెస్ ఫ్యాక్టరీలు వెయ్యికి పైగా ఉన్నాయి. వీటి నుంచి వచ్చే వ్యర్ధాలు, రసాయననాలు కాలువలు, డ్రైనేజీ, నదుల్లో కలుస్తున్నాయి. దీంతో ఆ నీళ్లు మొత్తం విషంగా మారాయి. వీధుల్లోని కుక్కలు ఆ నీటిని తాగటంతో శరీరం అంతా విషతుల్యమై.. రంగుమారిపోతున్నాయి. తర్వాత దశలో రంగుమారిన కుక్కలు చనిపోతున్నాయట.
ఇప్పటి వరకు కుక్కలే రంగు మారాయి.. ఇలాగే వదిలేస్తే తాము కూడా రంగు మారి చనిపోతామేమో అంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణాన్ని నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమని మహారాష్ట్రా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజినల్ ఆఫీసర్ అనిల్ మోహేకర్ హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్రదర్యాప్తు కోసం ప్రత్యేక అధికారిని నియమించినట్టు తెలిపారు.