పూణె తయారీ కేంద్రంగా ఉన్న లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్ ఇండియా' పర్యావరణ ప్రమాణాలను పాటించడం లేదని మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) ఆరోపించింది. ప్లాంట్ కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించాలని కోరింది.
మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి వ్రాతపూర్వక నోటీసు అందుకోలేదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. అవసరమైతే ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కంపెనీ పేర్కొంది.
2024 ఆగస్టు 23న నిర్వహించిన సాధారణ తనిఖీలో.. పూణేలోని చకాన్‌లోని మెర్సిడెస్ బెంజ్ అసెంబ్లీ ప్లాంట్ మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) నిర్దేశించిన కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలకు కట్టుబడి లేదని గుర్తించినట్లు బోర్డు తెలిపింది. దీంతో బెంజ్ అసెంబ్లీ ప్లాంట్ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ అధికారులను ఆదేశించింది. తక్షణ చర్యగా.. రూ. 25 లక్షల బ్యాంక్ గ్యారెంటీని జప్తు చేసినట్లు వెల్లడించింది.
ఆటోమోటివ్ ఇన్నోవేషన్‌లో అగ్రగామిగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ స్థిరమైన ఉత్పత్తి పద్ధతుల్లో పర్యావరణ ప్రమాణాలను పాటించకపోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. ఇది బ్రాండ్ మీదున్న నమ్మకాన్ని ఒమ్ముచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణం, సుస్థిరత పద్ధతులను నిలబెట్టడానికి.. తప్పనిసరి నిబంధనలను పాటిస్తామని, ప్రమాణాలకు కట్టుబడి ఉండటానికి కంపెనీ అధిక ప్రాధాన్యతనిస్తుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment