జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలోని తన తయారీ కర్మాగారంలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కొంత తక్కువ ఖర్చుతో కూడుకున్నదయినా.. జీరో ఎమిషన్ మొబిలిటీ సాధ్యమవుతుంది. తద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గుముఖం పడతాయి.
మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ విభాగంలో.. దేశీయ విఫణిలో ఈక్యూఎస్ కారును మాత్రమే తయారు చేస్తోంది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను స్థానీకరించడానికి కావలసిన ఏర్పాట్లను చేయనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు.
భారతదేశంలోని చకన్ ప్లాంట్‌లో కంపెనీ 2022 నుంచి బెంజ్ ఈక్యూఎస్ అసెంబ్లింగ్ ప్రారంభించింది. మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ విభాగంలో ఈక్యూఎస్ మాత్రమే కాకుండా ఈక్యూఏ, ఈక్యూబీ, ఈక్యూఈ వంటివి ఉన్నాయి. అయితే ఇండియాలో ఈక్యూఎస్ అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ కార్ల ఉత్పత్తి కూడా మన దేశంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ దేశీయ విఫణిలో తయారవుతోంది, కాబట్టి దీని ధర కొంత తక్కువగా ఉంది. లేకుంటే దీని ధర చాలా ఎక్కువగా ఉండేదని సంతోష్ అయ్యర్ వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ తన ఉత్పత్తులను ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తే ధరలు తగ్గుతాయి.
ఇదీ చదవండి: గౌతమ్ అదానీ కొత్త ప్లాన్.. వియత్నాంలో పోర్ట్!
ధరల విషయం పక్కన పెడితే.. దేశంలో కాలుష్య భూతం ప్రజలను పట్టిపీడిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కార్బన్ ఉద్గారాలు భారీగా పెరిగిపోతాయి. ఇది జీవరాశి మనుగడకే ప్రమాద హేతువు అవుతుంది. కాబట్టి కచ్చితంగా పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలు పుట్టుకురావాలి. దీనిని దృష్టిలో ఉంచుకునే పలు కంపెనీలు ఇప్పటికే CNG, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment