ఆ కేసులో మరో నిందితుడు మరణించాడు
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్(ఎంపీపీఈబీ) కుంభకోణంలోని మరో నిందితుడు చనిపోయాడు. గత రాత్రి తనకు ఛాతి నొప్పి ఉందని చెప్పిన నరేంద్ర సింగ్ తోమర్ ఇండోర్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో నిందితులై ఉండి చనిపోయివారి సంఖ్య 24కు చేరింది. 2009లో ఎంపీపీఈబీ ప్రీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్టు పరీక్ష కోసం అసలు అభ్యర్థులకు నకిలీ అభ్యర్థులను ఏర్పాటుచేసి పరీక్ష రాయించినట్లు నరేంద్ర సింగ్ తోమర్‌పై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కుంభకోణం అప్పట్లో భారీ సంచలనం సృష్టించింది. దీనికే వ్యాపం స్కాం అని కూడా పేరు ఉంది. ఇందులో బడా నేతల హస్తం కూడా ఉంది.
ఇప్పటికీ ఆ కేసు కోర్టుల్లోనే నలుగుతుంది కూడా. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు విభాగం(సిట్) ఈ కేసులో నిందితులైనవారిలో 23 మంది చనిపోయారని చెప్పగా.. వాస్తవానికి 40 మంది వరకు చనిపోయారని ఇతర వర్గాలు చెబుతున్నాయి. కాగా, తాజాగా గత శనివారం రాత్రి ఇండోర్‌లోని ఓ జైలులో ఉన్న నరేంద్రసింగ్ తోమర్ తనకు ఛాతీ నొప్పి వస్తుందని చెప్పడంతో అతడిని మహారాజ్ యశ్వంత్ రావ్ అనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు ప్రాణాలుకోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో దీనిపై మేజిస్టీరియల్ దర్యాప్తు జరపాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ కేసులో కీలక నిందితుడు శైలేశ్ యాదవ్(మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కుమారుడు) కూడా ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే.