మరో 5 రోజుల్లో తారక రత్న కొత్త సినిమా రిలీజ్.. అంతలోనే ఇలా..
నందమూరి తారకరత్న(40) అకాల మరణం టాలీవుడ్లో విషాదం నింపింది. చిన్న వయసులోనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తారకరత్న అకాల మరణం కారణంగా ఆయన నటించిన చివరి చిత్రం ‘మిస్టర్ తారక్’ విడుదలను వాయిదా వేశారు.
తారక రత్న హీరోగా శంకర్ డోరా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కావాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాను విడుదల చేయడం సరి కాదని వాయిదా వేసినట్లు చిత్ర దర్శక, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పేర్కొన్నారు.
మిస్టరీ, థ్రిల్లర్ సినిమాగా ‘మిస్టర్ తారక్’ తెరకెక్కింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య, ప్రాణ స్నేహితుడు ఒక్కటై మోసం చేస్తే.. హీరో ఏం చేశాడు? అనేది చిత్ర కథగా తెలుస్తోంది. ఇందులో సారా హీరోయిన్ నటించింది. ప్రతిజ్ఞ ప్రొడక్షన్స్ పతాకంపై మధు పూసల నిర్మించారు.