కార్యాలయాలు ఖాళీ చేయండి
* రాజకీయ పార్టీలకు ఎమ్మెమ్మార్డీయే నోటీసులు
* మంత్రాలయ సమీపంలో మెట్రో పనులకు అడ్డువస్తున్నాయని వివరణ
* అధికారులతో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన తదితర పార్టీలు
* పత్యామ్నాయం కోసం యత్నాలు
సాక్షి, ముంబై: నారిమన్ పాయింట్‌లోని మంత్రాలయ సమీపంలో మెట్రో ప్రాజెక్టు పనులకు అడ్డువస్తున్న వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాలను ఖాళీ చేయాలని ముంబై మహానగర ప్రాంతీయృభివద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) నోటీసులు జారీ చేసింది. దీంతో అక్కడున్న కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శివసేన తదితర పార్టీ కార్యాలయాల నాయకులు మెట్రో ప్రాజెక్టు పదాధికారులతో చర్చలు జరిపి ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొనేందుకు యత్నిస్తున్నారు.
ఏప్రిల్ లేదా మే లో మెట్రో రైలు పనులు ప్రారంభించేందుకు ఎమ్మెమ్మార్డీయే రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రైలు మార్గం కోసం పిల్లర్లు వేసేందుకు తవ్వకం పనులు ప్రారంభించాల్సి ఉంది. దీనికనుగుణంగా రెండు, మూడు నెలల్లో రాజకీయ పార్టీల కార్యాలయాలు ఖాళీ చేయాలని నోటీసులో స్పష్టం చేసింది. మంత్రాలయ భవనం సమీపంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గాంధీ భవన్, ఎన్సీపీకి చెందిన రాష్ట్రవాది భవన్, శివసేనకు చెందిన శివాలయ పేరుతో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి.
ప్రభుత్వానికి అవసరమైనప్పుడు స్థలాలను కచ్చితంగా ఖాళీ చేసి ఇస్తామన్న ఒప్పందం మేరకు ఈ పార్టీలన్నింటికీ ప్రభుత్వం స్థలాలు ఇచ్చింది. ఆ ప్రకారం మెట్రో పనులకు అడ్డు వస్తున్న ఈ కార్యాలయాలు ఖాళీ చేయక తప్పదు. కాంగ్రెస్‌కు దాదర్‌లో తిలక్ భవన్, శివసేన పార్టీకి శివాజీపార్క్‌లో సేన భవన్ ఇలా రెండేసీ భవనాలున్నాయి. కాని ఎన్సీపీకి రాష్ట్రవాది భవన్ మినహా మరో పార్టీ కార్యాలయం లేదు. దీన్ని ఇటీవ లే ఆధునీకరించారు. ఆ పార్టీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఇక్కడ నుంచే కొనసాగుతున్నాయి. మెట్రో జారీచేసిన నోటీసు ప్రకారం ఈ పార్టీ కార్యాలయం ఖాళీ చేస్తే.. కొత్త కార్యాలయం కోసం వెతుక్కోవల్సి ఉంటుంది.