MTDC
-
లడాఖ్‌లో అత్యాధునిక రిసార్ట్
సాక్షి, ముంబై : జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా ఉపసంహరించుకోవడంపై వివాదం ఇంకా కొనసాగుతుండగానే మహారాష్ట్ర ప్రభుత్వం లడాఖ్‌లో పర్యాటక రిసార్ట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి జయకుమార్ రావల్ ప్రకటించారు. లడాఖ్‌లో భూమిని కొనుగోలు చేసి ఎంటీడీసీ (మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఒక రిసార్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని రావల్ తెలిపారు. లడాఖ్, జమ్మూ కాశ్మీర్లను ప్రతి సంవత్సరం గణనీయమైన సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తారు. తాజాగా ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో, తాము అధికారికంగా రిసార్ట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని మంత్రి రావాల్ పేర్కొన్నారు. ఈ రిస్టార్‌ను అత్యంత ఆధునికంగా ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై అధికారిక నిర్ణయం త్వరలో తీసుకుంటామని రావల్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో ఎంటీడీసీ బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తామని కూడా ఆయన వెల్లడించారు. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 370తో పాటు, ఆర్టికల్ 35ఏ ను రద్దు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, లడాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించనున్నాయంటూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు సోమవారం రాజ్యసభలో ఆమోదం లభించింది. దీంతో జమ్మూ కశ్మీర్, లడాఖ్‌లో భూమిని కొనుగోలు చేయకుండా బయటి వ్యక్తులపై ఉన్న నిషేధం నిలిచిపోతుందని భావిస్తున్నారు. -
విదేశీ గడ్డపై ‘ఉట్టి’
సాక్షి, ముంబై : నగరంలో మహిళా దహిహండీ బృందాలకు మొట్టమొదటిసారిగా విదేశాల్లో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం దక్కింది. మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంటీడీసీ) న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో దివాలి సంబరాల పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ నెల 20వ తేదీన మహిళలతో నిర్వహించే దహి హండీ హైలెట్ కానుందని అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో టైమ్స్‌స్క్వేర్‌లో పురుష దహిహండీ బృందాలు ప్రదర్శన నిర్వహించాయి. అయితే మహిళా గోవింద బృందాలు అక్కడ ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారి. 20 మంది సభ్యులు గల గోవిందా బృందంలో 18 మంది మహిళా గోవిందులు కాగా, ఇద్దరు సమన్వయకర్తలు ఉంటారు. దహిహండీ సమన్వయ్ సమితి (ఎంటీడీసీ) సభ్యులు వివిధ దహిహండీ బృందాల నుంచి జట్టు సభ్యులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర పర్యాటక విభాగం ఈ బృందం కోసం వీసాతోపాటు వసతి, భోజన సదుపాయాలను స్పాన్సర్ చేయనుంది. బృందం సభ్యులు మాత్రం తమ టికెట్ కోసం రూ.75 వేల ఖర్చును సొంతంగా భరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా బృందం సమన్వయకర్త గీతా జగాడే (32) మాట్లాడుతూ.. విదేశాలలో తాము ప్రదర్శన ఇవ్వబోతుండటం ఆనందంగా ఉందన్నారు. అయితే తమకు సహాయ సహకారాలు అందించేందుకు ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదన్నారు. కనీసం దహి హండీ నిర్వాహక మండళ్లు నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. తమ బృందం న్యూయార్క్ వెళ్లాలంటే సుమారు రూ.10 లక్షలు అవసరం ఉంటాయని ఆమె తెలిపారు. దహిహండీ సమన్వయ సమితి అధ్యక్షుడు బాలా పదాల్కర్ మాట్లాడుతూ బృందం అక్కడికి వెళ్లేందుకయ్యే ఖర్చును ఎవరైనా స్పాన్సర్ చేస్తే బాగుంటుందని తాము ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను, రాజకీయ నాయకులను కలిశామని కాని ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఈ బృందానికి బీఎంసీ కనీసం రూ.రెండు లక్షలైనా సాయం చేయాలని స్వతంత్ర కార్పొరేటర్ విజయ్ తాండెల్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా మహిళా బృందానికి మేయర్ స్నేహల్ అంబేకర్, బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే సహాయం కూడా కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు.