ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ముంబై : జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా ఉపసంహరించుకోవడంపై వివాదం ఇంకా కొనసాగుతుండగానే మహారాష్ట్ర ప్రభుత్వం లడాఖ్‌లో పర్యాటక రిసార్ట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి జయకుమార్ రావల్ ప్రకటించారు.
లడాఖ్‌లో భూమిని కొనుగోలు చేసి ఎంటీడీసీ (మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఒక రిసార్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని రావల్ తెలిపారు. లడాఖ్, జమ్మూ కాశ్మీర్లను ప్రతి సంవత్సరం గణనీయమైన సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తారు. తాజాగా ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో, తాము అధికారికంగా రిసార్ట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని మంత్రి రావాల్ పేర్కొన్నారు. ఈ రిస్టార్‌ను అత్యంత ఆధునికంగా ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై అధికారిక నిర్ణయం త్వరలో తీసుకుంటామని రావల్ చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో ఎంటీడీసీ బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తామని కూడా ఆయన వెల్లడించారు.
కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 370తో పాటు, ఆర్టికల్ 35ఏ ను రద్దు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, లడాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించనున్నాయంటూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు సోమవారం రాజ్యసభలో ఆమోదం లభించింది. దీంతో జమ్మూ కశ్మీర్, లడాఖ్‌లో భూమిని కొనుగోలు చేయకుండా బయటి వ్యక్తులపై ఉన్న నిషేధం నిలిచిపోతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment