'మా ఆయనకు ఐఎస్ఐఎస్ తో లింక్స్ ఉన్నాయి'
ముంబై: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద గ్రూపుతో ముద్దబిర్ ముష్తాక్ షైక్ కు సంబంధాలు ఉన్న విషయం ఆయన కుటుంబానికి కూడా తెలిసినట్టు కనిపిస్తోంది. మహారాష్ట్రలోని ముంబ్రా పట్టణానికి చెందిన షైక్ (34)ను అతని ఇంటి నుంచి శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఏటీఎస్, ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. షైక్ ఎప్పుడూ సిరియాకు వెళ్తున్నానని చెప్పేవాడని ఆయన కుటుంబం చెప్తోంది.
షేక్ భార్య ఉజ్మా (30) బీకాం డిగ్రీ చదివింది. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ ఎజెంట్. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద భావజాలాన్ని అనుసరించవద్దని వారు ఎప్పుడూ షైక్ కు కౌన్సెలింగ్ చేస్తూ వచ్చారు. 'మనకు ఓ కుటుంబం ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారని నేను ఎప్పుడూ ఆయనకు చెప్పేదాన్ని. కానీ ఆయన మాత్రం నన్ను పట్టించుకునేవారు కాదు. ఇస్లామిక్ గ్రూపులో తానొక భాగమని, అది మంచి కోసం పనిచేస్తుందని చెప్పేవారు' అని ఉజ్మా తెలిపింది. ఈ క్రమంలో అమృతనగర్లోని రెష్మా అపార్ట్మెంట్లోని తమ నివాసంలో షైక్తో కలిసి ఉండలేక ఆమె బంధువుల వద్దకు వచ్చేసింది. భారత్లో ఐఎస్ఐఎస్కు నియామకాలు చేపడుతున్న వారిలో షేక్ ప్రధాన నిందితుడు అని పోలీసులు భావిస్తున్నారు. ఐటీ వృత్తినిపుణుడు అయిన అతన్ని శుక్రవారం ముంబైలోని ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టి.. ట్రాన్సిట్ రిమాండ్ పొందారు. అతన్ని సోమవారం ఢిల్లీలోని పాటియాల కోర్టు ఎదుట హాజరపరిచారు. ఐఎస్ఐఎస్ వ్యవహారంలో అరెస్టైన మొత్తం 12 మందికి పాటియాల కోర్టు సోమవారం రిమాండ్ విధించింది.
గత కొన్ని నెలల నుంచి ఐఎస్ఐఎస్తో తన భర్త క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాడని, అయితే గత నెలరోజులుగా అతను అంత చురుగ్గా ఈ ఇందులో పాలుపంచుకోలేదని ఉజ్మా తెలిపింది. ఈ విషయాన్ని తాను పోలీసులకు తెలిపానని, కేవలం విచారణ కోసమే తన భర్తను అరెస్టు చేసినట్టు వారు తెలిపారని ఆమె వివరించింది.