ప్రపంచంలోనే అత్యంత బాల కుబేరుడు ఎవరో తెలుసా?
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పిల్లాడు ఆషామాషీ బుడ్డోడేమీ కాదు, ఇతగాడు బాలకుబేరుడు. పట్టుమని పదేళ్ల వయసైనా లేదు గాని, వయసుకు మించినన్ని లగ్జరీ కార్లు, రాజప్రాసాదాన్ని తలపించే భవంతి, ఒక ప్రైవేటు విమానం ఇతడి సొంతం. ఈ నైజరీయన్ బాలకుబేరుడి పేరు మహమ్మద్ అవల్ ముస్తఫా. నైజీరియాలో ఇతడు ‘మోంఫా జూనియర్’గా ఫేమస్.
ఈ బాలకుబేరుడి కథా కమామిషూ ఏమిటంటే, ఇతడి తండ్రి ఇస్మాయిలా ముస్తఫా నైజీరియాలో ఇంటర్నెట్ సెలిబ్రిటీ. ‘మోంఫా’ పేరుతో బాగా ఫేమస్. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇతగాడి ఫాలోవర్ల సంఖ్య 12 లక్షల మందికి పైమాటే! ‘మోంఫా’ ప్రధాన ఆదాయ వనరు ఇంటర్నెట్ అయితే, దీనితో వచ్చిన ఆదాయంతో వేర్వేరు వ్యాపారాలూ సాగిస్తూ ఇబ్బడిముబ్బడిగా డబ్బు గడిస్తున్నాడు. తన కొడుకు ‘మోంఫా జూనియర్’కు మూడేళ్ల కిందట– 2019లో అతడి ఆరో పుట్టినరోజు సందర్భంగా లాగోస్ నగరంలో రాజప్రాసాదాన్ని తలపించే ప్యాలెస్‌ను కానుకగా ఇచ్చాడు.
‘మోంఫా జూనియర్’ కూడా ఇప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయ్యాడు. బ్రాండెడ్ దుస్తులతో, లగ్జరీ కార్లతో పోజులిస్తూ ఫొటోలు పెడుతుండటంతో ఈ బాలకుబేరుడికి ఫాలోవర్లు బాగానే పెరుగుతున్నారు. ఇదిలా ఉంటే, బాలకుబేరుడి తండ్రి సీనియర్ ‘మోంఫా’ మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటుండటం గమనార్హం.