ఉత్తమ విలన్
వీరు పెంటయ్య...
వీరశంకరరెడ్డి ఎలా అయ్యాడు?
‘కత్తులతో కాదురా కంటి చూపుతో చంపుతా’ కేకలు... చప్పట్లు.... వన్స్మోర్లు... హీరోగారి నుంచి ఈ పవర్ఫుల్ డైలాగ్ రావడానికి కారణం ఎవరు? విలన్. విలన్ ఎంత గట్టివాడైతే హీరో నోటి నుంచి అంత పవర్ఫుల్ డైలాగ్‌లు వస్తాయి అని చెప్పడానికి ఈ పాపులర్ డైలాగే ఉదాహరణ. మరి ఈ లెక్కన కుప్పుస్వామినాయుడు కూడా గా...ట్టి విలనే కదా! దేవాలయంలో దేవునికి నిశ్శబ్దంగా మొక్కుకుంటున్న నరసింహనాయుడితో గిచ్చి తగాదా పెట్టుకోవాలనుకుంటాడు కుప్పుస్వామి నాయుడు. ఇలా ఒక డైలాగు కూడా విసురుతాడు...
‘నా పేరు కుప్పుస్వామి నాయుడు. అప్పలనాయుడి బావమరిదిని. బావమరదులు బావ బతుకు కోరుతారు. కానీ నా బావ బతికిలేడు. కనుక... నేను మా బావను చంపినవాడి చావు చూసే వరకు నిద్రపోను’ అంతేనా? ‘ఇది గుడైపోయిందిరా’ అని కూడా కవ్విస్తాడు. మరి హీరో ఊరుకుంటాడా? ‘ఎక్కడైనా’ ‘ఎప్పుడైనా’ అంటూనే ‘కత్తులతో కాదురా...’లాంటి పవర్ఫుల్డైలాగ్ చెబుతాడు. ‘గాండీవం’లో వీరు పెంటయ్య, ‘మనోహరం’లో ఐఎస్ఐ బాషా, అంతకుముందు బాలీవుడ్ సినిమాలు ‘ఘాయల్’ ‘పరంపర’ ‘గర్దిష్’ ‘బాజీ’... ముఖేష్ రుషి చాలా బాగానే నటించి ఉండొచ్చు....అయితే మన మాస్ కళ్లకు దగ్గర చేసింది మాత్రం ‘నరసింహనాయుడు’ ‘ఇంద్ర’లాంటి సినిమాలే. ఫ్యాక్షనిస్ట్ అనగానే తనే గుర్తుకుచ్చేలా నటించాడు ముఖేష్. ఆరడుగుల ఎత్తుకు, డబ్బింగ్ కంచుకంఠం తోడై కళ్లతోనే ఎర్రగా రౌద్రం పలికించి ‘విలన్ అంటే ఇలా ఉండాలి’ అనుకునేలా చేశాడు.
చండీగఢ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ముంబైలో స్టోన్-క్రషింగ్ బిజినెస్ చేశాడు ముఖేష్. ఆ తరువాత ఫిజీలో వ్యాపారం చేయడానికి వెళ్లాడు. అక్కడ కొన్నేళ్లు ఉన్న తరువాత న్యూజిలాండ్‌లో స్టోర్ మేనేజర్‌గా పనిచేయడానికి వెళ్లాడు. అదే సమయంలో వివిధ కంపెనీలకు మోడలింగ్ కూడా చేసేవాడు. తీరిక లేని ఉద్యోగం, మోడలింగ్...ఈ రెండూ సంతృప్తి ఇవ్వడం లేదు. మనసు ఇంటివైపు లాగుతుంది. అలా ఏడు సంవత్సరాల తరువాత ముంబైకి తిరిగివచ్చాడు. ‘రోషన్ తనేజాస్ యాక్టింగ్ స్కూల్’లో చేరాడు. ‘‘నేను మంచి నటుడిని కాదు అనే విషయం నాకు తెలుసు. నటనలో నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు బాగా నటిస్తున్నావు. ఇక వేషాల కోసం ప్రయత్నించవచ్చు అనే మీరు చెప్పేదాకా నా ప్రయత్నాలేవీ చేయను’’ అని తనేజాతో చెప్పాడు. అయితే ఆరునెలలకే ‘ఇక నువ్వు దూసుకెళ్లవచ్చు’ అంటూ తనేజా అనుమతి ఇచ్చారు.
ఇక అప్పటి నుంచి సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం ప్రారంభించాడు ముఖేష్. సంజయ్‌ఖాన్ ‘టిప్పు సుల్తాన్’ సీరియల్‌తో ముఖేష్‌కు తొలి బ్రేక్ వచ్చింది. అందులో మీర్ అలీఖాన్ పాత్ర వేశాడు ముఖేష్. ఎత్తు, మంచి శరీరసౌష్టవం ఉండడం వల్ల పెద్దగా కష్టపడకుండానే ముఖేష్‌కు అవకాశాలు వచ్చేవి. ప్రియదర్శన్ ‘గర్దిష్’ సినిమాలో బిల్లా జిలానీ పాత్రతో ప్రేక్షకుల దృష్టిలో గట్టి విలన్‌గా గుర్తింపు పొందాడు ముఖేష్. ఆ తరువాత వరుసగా నలభై సినిమాలు చేశాడు. అన్నీ నెగెటివ్ రోల్సే. ఇక ‘సర్ఫ్రోష్’లో ఇన్స్పెక్టర్ సలీమ్ పాత్రను చాలెంజింగ్‌గా తీనుకొని అద్భుతంగా నటించాడు ముఖేష్. ఆ పాత్ర ప్రేక్షకులపై ఎంత ముద్రవేసిందంటే... ఒకసారి ముఖేష్ జమ్మూలో ఉన్నప్పుడు ఒక సంభాషణ వినిపించింది. ఒకరు ఇలా అంటున్నారు... ‘‘ఈ దేశం నుంచి టైజాన్ని తుడిచిపెట్టాలంటే అజయ్‌సింగ్ రాథోడ్(అమీర్‌ఖాన్), సలీమ్(ముఖేష్ రుషి) కావాలి’’ ముఖేష్ రుషిని విలన్ పాత్రల్లో చూసీ చూసీ కొందరు ప్రేక్షకులకు బోర్ కొట్టవచ్చు. వాళ్ల అబ్బాయి... ‘‘మంచి పాత్రలు వేయవూ’’ అని అడిగి ఉండవచ్చు.
అయితే నటన విషయంలో... ‘మంచి పాత్ర’ అంటే నైతిక విలువలతో ముడిపడి ఉన్నది కాదు. ఎంత మంచిగా నటించాడన్నదే మంచి పాత్ర. ఆ రకంగా... ముఖేష్ రుషి ఉత్తమవిలన్. ‘గాండీవం’లో వీరు పెంటయ్యగా పరిచయమై కానట్లు అనిపించినా, వీరశంకరరెడ్డిగా మాత్రం ఇప్పుడు ముఖేష్ సుపరిచితుడు. దీనికి కారణం ఆయన అత్యున్నత నటన అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!