ముఖేశ్ రిషి.. తెలుగులో ఇన్‌స్పెక్టర్‌గా మొదలుపెట్టి తర్వాత విలన్‌గా స్థిరపడిపోయాడు. ఒక్క టాలీవుడే కాదు తమిళ, మలయాళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ విలనిజం పండించి స్టార్ నటుడిగా ఎదిగాడు. చాలామందికి ఈయనను చూడగానే గుర్తొచ్చే డైలాగ్.. 'వీరశంకర్ రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా'.. ఇంద్ర మూవీలో చిరంజీవి విలన్‌కు వార్నింగ్ ఇస్తూ చెప్పిన డైలాగిది! ఈ సినిమా విజయంతో ఇతడు తెలుగులో ఫుల్ బిజీ అయ్యాడు. సినిమాల్లో గూండాగిరి చేసే ఈయన హిందీ గూండా మూవీలోనూ దాదాగిరి చేశాడు. 1998లో రిలీజైన ఈ మూవీ అప్పుడు ఘోర పరాజయం చవిచూసింది.
ఆ సినిమా ఒప్పుకుని తప్పు చేశా..
మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. గూండాను ద్వేషించారు. కానీ తర్వాతి కాలంలో మాత్రం ఇది కల్ట్ బొమ్మగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు విలన్ ముఖేశ్ రిషి. అతడు మాట్లాడుతూ.. 'నేను గూండా సినిమా చేసిన రోజులవి.. షూటింగ్ మొదలైన కొన్నిరోజులకే ఈ మూవీ ఒప్పుకుని తప్పు చేశాననిపించింది. ఓ సీనియర్ నటుడు కూడా అలాంటి పాత్ర చేయడం అవసరమా? అని తిట్టాడు.
అప్పుడు తిట్టారు.. తర్వాత పొగిడారు
అప్పుడు నేను ఇండస్ట్రీకి కొత్తగా దొరికిన విలన్‌ను. మంచిమంచి సినిమాలు చేస్తున్నాను. అలాంటి సమయంలో గూండా సినిమా ఎలా ఒప్పుకున్నానో నాకే అర్థం కాలేదు. అప్పుడా చిత్రం ఆడలేదు.. కానీ అది విడుదలైన కొన్నేళ్లకు.. అంటే కంప్యూటర్లు నెమ్మదిగా అలవాటైతున్న రోజుల్లో జనాలు గూండాను చూశారు. మెచ్చుకున్నారు. బుల్లా(సినిమాలో పాత్ర పేరు)గా నీ క్రేజ్ ఎలా ఉందో తెలుసా? ఇంటర్నెట్‌లో మొత్తం నీదే హవా అని సైఫ్ అలీఖాన్ చెప్పేవరకు నాకు ఈ విషయం తెలియలేదు.
ఇప్పటికీ ఆ పాత సినిమాలు..
తర్వాత నాకు విదేశీయుల నుంచి కూడా అభినందనలు రావడం మొదలైంది. ఎక్కడికి వెళ్లినా బుల్లా డైలాగులు చెప్పమనేవారు. ఆ సినిమా చేసినప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నానని ఫీలయ్యాను. కానీ ఇప్పటి జనరేషన్‌కు అది ఎంతో నచ్చేసింది. 20-30 ఏళ్ల కింద రిలీజైన సినిమాలను కూడా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, డైలాగులు గుర్తుపెట్టుకుంటున్నారు' అని చెప్పుకొచ్చాడు ముఖేశ్.
చదవండి: అన్న బ్రహ్మచారి, తమ్ముడేమో రెండు పెళ్లిళ్లు.. సల్మాన్ రియాక్షనిదే!
Comments
Please login to add a commentAdd a comment