mumbai mayor post
-
మహారాష్ట్ర సీఎం సరికొత్త ఎత్తుగడ!
ముంబై: బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు శివసేన కోసం కొత్త ఎత్తుగడ వేసింది. ముంబై మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులకు పోటీ చేయకూడదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఈ పదవులకు కాంగ్రెస్, ఎన్సీపీలను శివసేనకు దూరంగా ఉంచేందుకు బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది. మార్చి 8వ తేదీన ముంబై మేయర్ పదవికి ఎన్నిక జరగనుంది. శివసేన పార్టీ ఇదివరకే మేయర్, డిప్యూటీ మేయర్ల అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. శివసేన ప్రకటించిన మేయర్ అభ్యర్థికి మద్దతిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ శనివారం మీడియాకు వెల్లడించారు. ముంబై మేయర్ పదవికి శివసేన అభ్యర్థిగా మహేందేశ్వర్ బరిలో ఉన్నారు. 'ముంబై ప్రజలు పారదర్శకతను కోరుకుంటున్నారు. అందుకే శివసేన, బీజేపీలలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. అలాగని మేం శివసేనకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రసక్తే లేదని' ఫడ్నవీస్ అన్నారు. ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో శివసేన మద్దతు అవసరమైనందున ఫడ్నవీస్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 227 వార్డులున్న ముంబై మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో శివసేన 84, బీజేపీ 82, కాంగ్రెస్ 31 సీట్లతో తొలి మూడు స్థానాల్లో నిలవడం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన మరో ముగ్గురు శివసేన తిరుగుబాటు అభ్యర్థులు కూడా తిరిగి పార్టీ గూటికి చేరటంతో శివసేన బలం 87కు పెరిగింది. మేయర్ పీఠం దక్కించుకోవడానికి శివసేన, ఏ ఇతర పార్టీకైనా 114 కార్పొరేటర్ల మద్దతు ఉండాలి. -
శివసేనకు ఆర్ఎస్ఎస్ ఆఫర్?
ముంబై : బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు అయినా ఇప్పటికీ మేయర్ పదవిపై ఉత్కంఠ వీడలేదు. బీఎంసీ ఫలితాల్లో బీజేపీ, శివసేన పోటాపోటీగా సీట్లు గెలుపొందిన విషయం విదితమే. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ పాతమిత్రులు కలిసేలా కనిపిస్తున్నారు. ఈ మేరకు రెండు పార్టీల మధ్య డీల్ కుదిరిందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. అంతేకాకుండా శివసేన-బీజేపీ పార్టీలు మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకుంటాయని ఆర్ఎస్ఎస్ నేత ఎంజీ వైద్య ఓ సూచన కూడా చేయడం గమనార్హం. మరోవైపు శివసేన ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీనే ముందుగా మేయర్ పదవి చేపట్టవచ్చని ఆయన ఆదివారంనాడు ఇక్కడ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎంజీ వైద్య వ్యాఖ్యలపై రెండు పార్టీలు ఇప్పటివరకూ స్పందించలేదు. కాగా బీఎంసీలో ఏ పార్టీకి మెజార్టీ రాకపోయినప్పటికీ అధికారం ఏర్పాటు చేసేందుకు శివసేన-బీజేపీలకు సమాన అవకాశాలున్నాయి. దీంతో ఇరుపార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. మరోవైపు 31మంది కార్పొరేటర్లను గెలుచుకున్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేందుకు ఇటు బీజేపీ, అటు శివసేనే కానీ సిద్ధంగా లేవు. అలాగే ఇండిపెండెంట్ల మద్దతు, గెలిచిన తిరుగుబాటుదారులు సొంతగూటికే చేరడంతో శివసేనకు 89మంది కార్పొరేటర్ల బలం ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఇండిపెండెంట్లతో పాటు ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో మేయర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇప్పటికే పొత్తు కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే కలిసి కూర్చుని చర్చించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. -
బీజేపీని ఇరకాటంలో పెడుతుందా?
ముంబై: బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ పదవి శివసేనకు దక్కేలా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలనుకోవడంపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి ఇది మంచి అవకాశమని కొందరు అంటుంటే.. ఎన్నికల్లో బీజేపీ, శివసేన రెండింటిపై కాంగ్రెస్ పోటీ చేసిందనీ, ఎన్నికల అనంతరం శివసేనకు మద్దతు ఇవ్వడం నైతికత కాదని మరి కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గురుదాస్ కామత్ మాట్లాడుతూ ‘శివసేనకు పరోక్ష మద్దతు లేదా ఎలాంటి సాయాన్నైనా చేసేందుకు నేను పూర్తి వ్యతిరేకం. దీని గురించి నా అభిప్రాయాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెబుతాను’అని అన్నారు. పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ మాత్రం బీజేపీ ప్రభుత్వంతో శివసేన తెగతెంపులు చేసుకుంటే తర్వాత ఆలోచిస్తామని శుక్రవారం సంకేతాలిచ్చారు. ఏది ఏమైనా నిర్ణయం మాత్రం తమ పార్టీ అధిష్టానానిదే అని, రాష్ట్ర స్థాయిలో దీనిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మొత్తం 227 వార్డులున్న ముంబై మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో శివసేన 84, బీజేపీ 82, కాంగ్రెస్ 31 సీట్లతో తొలి మూడు స్థానాల్లో నిలవడం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన మరో ముగ్గురు శివసేన తిరుగుబాటు అభ్యర్థులు కూడా తిరిగి పార్టీ గూటికి చేరటంతో శివసేన బలం 87కు పెరిగింది. కానీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి కనీసం 114 మంది కార్పొరేటర్లు అవసరమైనందున, శివసేకు మద్దతిచ్చి రాష్ట్రంలో బీజీపీని ఇబ్బందుల్లోకి నెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.