గీత దాటితే వాతే..!
సాక్షి, ముంబై: ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై నిబంధనలను అతిక్రమించేవారి ఆగడాలకు చెక్‌పెట్టేందుకు రాష్ట్ర హైవే పోలీసులు భారీ కసరత్తే చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించినవారిపై రూ.800 జరిమానా విధించాలని నిర్ణయించారు. 94 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిపై క్రమశిక్షణ పాటించనివారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ మార్గంపై పోలీసులను మోహరించడమేకాకుండా వైర్లెస్ ఇంటర్నెట్ పరికరాలు, ఇతర సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. మాల్వాణి, పన్వేల్, రసయాని, భట్నే గ్రామాలలో వాహన దారులు క్రమశిక్షణ పాటించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. అయితే వాహన నిబంధనలు ఉల్లఘించిన వారికి మోటాలు వాహనాల చట్టం ప్రకారం.. రూ.800 జరిమానా విధించనున్నారు.
అంతేకాకుండా లైన్ కటింగ్ చేసిన వారికి రూ.100 జరిమానా విధించనున్నారు. మితిమీరిన వేగంతో నడిపిన వారి నుంచి రూ.200, నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వారి నుంచి రూ.500 జరిమానాగా వసూలు చేయనున్నారు. ఇదిలాఉండగా కుడివైపు ఉన్న లేన్ ఓవర్ టేక్ చేసే వారి కోసం కేటాయించగా, కుడి వైపు ఉన్న లైన్ భారీ వాహనాలకు, మధ్య లైన్‌ను ఇతర వాహనాలకు కేటాయించినట్లు పుణే జిల్లా కలెక్టర్ జారీ చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది. సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (హైవే) దిలీప్ భుజ్‌బల్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఈ ఎక్స్‌ప్రెస్ హైవేపై రోజుకు సగటున 34,000 వాహనాలు నడుస్తూ ఉంటాయన్నారు.
ఇందులో 80 శాతం వాహనదారులు క్రమశిక్షణను పాటించడం లేదనే విషయం తమ పరిశీలనలో వెల్లడైందని చెప్పారు. దీంతో ఈ హైవేపై ఘోరమైన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, మోటార్ వెహికల్ చట్టం ప్రకారం.. ప్రస్తుతం ఫామ్‌లో లేన్ కట్టింగ్‌కు సంబంధించి స్పష్టమైన చట్టాలు లేవని, దీంతో హైవే, ఎక్స్‌ప్రెస్ హైవేపై వివిధ వాహనాలు లేన్ నిబంధనలు పాటించడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్‌కు అందజేసిన నివేదికలో స్పష్టంగా తెలియజేశామని భుజ్‌బల్ పేర్కొన్నారు.
ఇదిలాఉండగా లైన్ కట్టింగ్లపట్ల డ్రైవర్లకు, వాహన యజమానులకు అవగాహన కల్పించేందుకు లేన్ డిసిప్లిన్ డ్రైవ్‌ను చేపట్టామని, కొన్నిరోజుల తర్వాత నిబంధనలు ఉల్లఘించిన వారికి జరిమానా విధిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్ హైవేపై 38 ఓవర్ బ్రిడ్జలు ఉన్నాయి. లేన్ డిసిప్లిన్ గురించి అక్కడక్కడ ఫ్లెక్సీ బోర్డులను అమర్చనున్నారు.అంతేకాకుండా ఠాణే, పుణే రీజియన్లలో స్పీడ్ గన్లను ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకొని ఉన్న సీసీటీవీ కెమెరాలను ఈ మార్గాలపై ఏర్పాటు చేయనున్నారు. దీంతో నిబంధనలు అతిక్రమించిన వారిని సులువుగా పట్టుకునే వీలు ఉంటుంది.