ముంబైలో తొక్కిసలాట.. 18 మంది మృతి
66 మందికి గాయాలు..
సాక్షి, ముంబై: దావూదీ బోహ్రా ముస్లిం తెగ ఆధ్యాత్మిక గురువు డాక్టర్ సయ్యద్నా మహ్మద్ బర్హనుద్దీన్ భౌతికకాయానికి నివాళులు అర్పించే సమయంలో విషాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. 66 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని పోలీసులు వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, 102 ఏళ్ల సయ్యద్నా శుక్రవారం గుండెపోటుతో ఇక్కడి మలబార్ హిల్ ప్రాంతంలో ఆయన ఇంటి (సైఫీ మహల్)లో కన్నుమూశారు. మరణవార్త తెలుసుకున్న ఆయన అభిమానులు కడసారి చూపుకోసం రాత్రి నుంచే ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో తరలిరావడం మొదలుపెట్టారు. శనివారం తెల్లవారు జామున అంతిమ దర్శనం కొద్దిసేపు నిలిపేస్తున్నామనే ప్రకటన రావడంతో ఒక్క సారిగా ప్రజలు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది.
ఇక్కడి వీధులన్నీ ఇరుకుగా ఉండడం, భారీగా జనం హాజరుకావడంతో ఊపిరాడక ఎక్కువమంది మరణించారని ముంబై పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా ధ్రువీకరించారని ఆయన తెలిపారు. ఊపిరి అందకపోవడంతో కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారన్నారు. సమీపంలోని గేట్లు కూడా మూసివేయడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని ఆయన వెల్లడించారు. సయ్యద్నా నివాసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి చేరువలోనే ఉంది. కాగా, గాయపడిన వారికి సైఫీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటన అనంతరం ఉదయం 10 గంటల తర్వాత సయ్యద్నా అంతిమయాత్ర ప్రారంభమైంది. రెండు లక్షల మందికి పైగా ఆ యాత్రలో పాల్గొన్నారు. బెండీ బజార్‌లోని రౌదాత్ తహేరాలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సయ్యద్నా మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాపం తెలిపారు.
మతగురువే కాదు గొప్ప మానవతావాది!
సాక్షి, ముంబై: మలబార్ హిల్‌లోని సైఫీ మహల్లో శుక్రవారం మృతిచెందిన బుర్హానుద్దీన్ కేవలం భోరా సామాజిక వర్గానికి చెందిన 52వ మతగురువు మాత్రమేకాదు అంతకు మించిన మానవతావాది కూడా. మూఢ నమ్మకాలను పారద్రోలి, విద్య ప్రాముఖ్యతను తెలియజేసి వెనుకబడిన భోరాల ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు. 1912, మార్చి 6న సూరత్‌లో జన్మించిన ఆయన 15వ యేటనే హజ్ యాత్రకు వెళ్లారు. 1965లో భోరా సమాజానికి 52వ మతగురువుగా నియమితులయ్యారు. ఆయన వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని 2011 మార్చి 25న దేశవ్యాప్తంగా భారీ ఉత్సవాలు నిర్వహించారు. ఆయన నివాసముంటున్న ముంబైలో భారీగా పుట్టినరోజు వేడుకలు జరిపారు.
ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, ఆ సమాజం ప్రజలు, మతగురువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో భోరా సమాజం ప్రజలు పార్థనలు చేసుకునేందుకు అవసరమైన ప్రార్థనాస్థలాల ఏర్పాటుకు, సాంస్కృతిక కేంద్రాలు నెలకోల్పడానికి ఎంతో చొరవ తీసుకున్నారు. ఆయన స్థాపించిన ప్రార్థనాస్థలాలు ఉత్తర అమెరికా, యూరప్, ఆఫ్రికా, అస్ట్రేలియా తదితర దేశాలలో ఇప్పటికీ ఉన్నాయి. మనదేశంలో కూడా ఎన్నో సదస్సులు నిర్వహించారు. అంతేకాక ముంబై, సూరత్, దుబాయ్, కరాచీ, కొలంబో తదితర దేశాల్లో సమావేశాలు, చర్చాగోష్టులు, అవగాహన శిబిరాలు నిర్వహించారు. విద్యా సంస్థలు నెలకొల్పి విద్యార్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. ఆయనను ఆర్డర్ ఆఫ్ దస్టార్ ఆఫ్ జర్డన్, అలీగఢ్ ముస్లీం యూనివర్సిటీ డాక్టరేట్ తో, డాక్టర్ ఆఫ్ ఇస్లామిక్ సైన్స్, టెక్సాస్ యూనివర్సిటీ, కరాచీ యూనివర్సిటీ చాన్స్‌లర్ పదవులతో సన్మానించాయి. లండన్‌లోని రాయల్ అల్బర్ట్ హాల్లో ప్రసంగించిన ఘనత కూడా ఆయనకు దక్కింది.