
ముంబయి : దసరా పండుగ వేళ విషాదం నింపిన ముంబయి ఎల్ఫిన్‌స్టోన్ రోడ్డులోని రైల్వే స్టేషన్ పాదచారుల వంతెనపై ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు ఒక వైరల్ వీడియో ఓ కొత్త నేర విచారణ ప్రారంభించడానికి కారణం అయింది. సహాయం చేసే పేరిట వచ్చి వంతెనపై చిక్కుకుపోయిన ఓ మహిళను లైంగికంగా ఓ యువకుడు వేధించినట్లుగా ఆ వీడియోలో ఉంది. నిజంగా అతడు సహాయం చేస్తున్నాడా లేక ఆ పేరుతో అడ్వాన్‌టేజ్ తీసుకొని అలాంటి భయానక పరిస్థితుల్లో కూడా అనుచితంగా ప్రవర్తించాడా అనే విషయం స్పష్టంగా తేలాల్సి ఉంది.
ప్రస్తుతం లభించిన ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అలాగే, ఆ సమయంలో తమ ఫోన్‌లలో తీసిన వీడియోలను, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించనున్నారు. పాదచారుల వంతెనపై తొక్కిసలాట జరిగినప్పుడు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఆ సమయంలో ఓ మహిళ కొంతమంది మధ్య ఇరుక్కుపోయింది. అయితే, సహాయం చేసేందుకంటూ వెళ్లిన ఓ యువకుడు ఆమెను అసభ్యంగా తాకుతూ కనిపించాడు. పోలీసులు కూడా అదే విషయం నిర్ధారణకు వచ్చినప్పటికీ ఆ వ్యక్తి ఎవరో పట్టుకొని విచారిస్తేగానీ అంతిమ నిర్ణయానికి రాలేమని అంటున్నారు.