ఫాంహౌజ్‌లో బంధించి.. సామూహిక అత్యాచారం కేసులో ఏడుగురికి రిమాండు | - | Sakshi
Sakshi News home page

ఫాంహౌజ్‌లో బంధించి.. సామూహిక అత్యాచారం కేసులో ఏడుగురికి రిమాండు

Published Fri, May 12 2023 12:13 PM | Last Updated on Fri, May 12 2023 12:13 PM

వివరాలు వెల్లడిస్తున్న సీఐ రమేశ్‌బాబు  - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీఐ రమేశ్‌బాబు

అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఒక గదిలో రమణమ్మపై బాలస్వామి, కుర్వ నర్సింహ అత్యాచారం చేయగా మరో గదిలో గంగమ్మపై కుర్వ వంశీ, శ్రీశైలంలు అత్యాచారం

జడ్చర్ల: సామూహిక అత్యాచార ఘటనకు పాల్పడిన ఏడుగురు నిందితులను గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ రమేశ్‌బాబు విలేకరులకు వెల్లడించారు. మండలంలోని కోడ్గల్‌ గ్రామ శివారులో రవికుమార్‌కు చెందిన మలబార్‌ తోటలో ఏపీలోని గుంటూరు జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన చెందిన లక్ష్మి నాలుగేళ్లుగా కూలీగా పనిచేస్తుంది. అలాగే జడ్చర్ల మండలం నెక్కొండకు చెందిన కాటమోని బాలస్వామి సైతం ఇదే తోటలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో బాలస్వామి, లక్ష్మి మధ్య కొంత చనువు ఏర్పడింది. రెండు నెలల కిందట లక్ష్మి అక్కడి నుంచి బాలానగర్‌ మండలం నేరళ్లపల్లి శివారులోని మరో తోటలో పనిచేసేందుకు వెళ్లింది.

ఈ నేపథ్యంలో తోటలో పనుల కోసం పల్నాడు ప్రాంతానికి చెందిన బంధువులు రమణమ్మ, రమేశ్‌ కలిసి లక్ష్మి దగ్గరకు వచ్చారు. తమకు బంగారు దొరికిందని, దానిని ఎవరికై నా అమ్మాలని లక్ష్మిని కోరారు. దీంతో లక్ష్మి బాలస్వామికి చెప్పింది. అప్పటికే తన దగ్గర భూమి అమ్మిన డబ్బులు ఉండడంతో తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మిన బాలస్వామి రూ.2 లక్షలు ఇచ్చి అర కిలో నకిలీ బంగారు బిస్కెట్‌ తీసుకున్నాడు. బంగారు విక్రయం తర్వాత లక్ష్మి ఇక్కడి తోటలోనే పనులు చేసుకుంటుండగా రమణమ్మ, రమేశ్‌లు స్వగ్రామానికి వెళ్లిపోయారు.

తర్వాత బాలస్వామి తాను కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్‌ను పరీక్షించగా అది నకిలీగా తేలడంతో లక్ష్మిని నిలదీశాడు. తమను మోసం చేసిన వారిని ఎలాగైనా ఇక్కడికి రప్పించి డబ్బులు వసూలు చేసుకోవాలని భావించిన బాలస్వామి గ్రామానికి చెందిన మరికొందరితో కలిసి రమేశ్‌కు ఫోన్‌ చేసి తమకు మరికొంత బంగారు కావాలని నమ్మబలికారు. దీంతో రమేశ్‌, రమణమ్మ, బయ్యా గంగమ్మతో కలిసి ఈ నెల 8న వచ్చారు. అదే రోజు బాలస్వామి, లక్ష్మి, నరేష్‌, శ్రీశైలం మార్గమధ్యలో కల్వకుర్తి సమీపంలోని జేపీనగర్‌ దగ్గర వేచి ఉన్నారు.

వారు బైక్‌పై రాగానే ముందస్తు పథకం ప్రకారంగా ఏర్పాటు చేసుకున్న స్కార్పియోలో రమేశ్‌, రమణమ్మ, గంగమ్మలను కిడ్నాప్‌ చేసి కోడ్గల్‌లోని తోటలో ఫాంహౌజ్‌కు తీసుకువచ్చి బంధించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా రమేశ్‌ నిరాకరించడంతో బాలస్వామి మరికొందరు చితకబాదారు. అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఒక గదిలో రమణమ్మపై బాలస్వామి, కుర్వ నర్సింహ అత్యాచారం చేయగా మరో గదిలో గంగమ్మపై కుర్వ వంశీ, శ్రీశైలంలు అత్యాచారం చేశారు.

ఈ క్రమంలో రమేశ్‌ వారి నుంచి తప్పించుకుని గ్రామస్తులకు విషయం చెప్పి జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారం జరిపిన వారితోపాటు ఘటనకు సహకరించిన లక్ష్మి, శేఖర్‌, కుమ్మరి గణేష్‌, ప్రవీణ్‌గౌడ్‌, డ్రైవర్‌ వంశీలపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. వీరిలో లక్ష్మి, డ్రైవర్‌ వంశీ పరారీలో ఉన్నారు. నిందితులకు సంబంధించిన మూడు బైక్‌లు, ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ ఖాదర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement