దుబాయ్‌కి సల్మాన్.. కోర్టు ఓకే
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ పరిస్థితి అన్నీ మంచి శకునములే అన్నట్టుగా ఉంది. ఈ కండల వీరుడికి దుబాయ్ వెళ్లేందుకు అనుమతి మంజూరుచేస్తూ ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సల్మాన్ సంబరాల్లో మునిగితేలుతున్నాడు. విదేశీ ప్రయాణానికి అనుమతిని కోరుతూ మే 21న సల్మాన్ ఖాన్ పెట్టుకున్న అర్జీకి ముంబై హైకోర్టు సానుకూలంగా స్పందించి, అనుమతిని మంజూరు చేసింది.
కాగా హిట్ అండ్ రన్ కేసులో దోషిగా నిర్ధారణ అయ్యి శిక్షపడిన అనంతరం అతడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదనే నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో మే 29న జరగనున్న షో కోసం దుబాయ్ వెళ్లడానికి అనుమతిని కోరుతూ హైకోర్టులో సల్మాన్ పిటిషన్ దాఖలు చేశాడు. అనూహ్యంగా బెయిల్ లభించడంతో ఈ దబాంగ్ హీరో తన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పనిలో తలమునకలై ఉన్నాడు.