సరిగమల సారస్వతంగలగలల వారసత్వం
ఎవరి ఫీల్డులో వారి పిల్లలు ఉండడం సహజం.
‘నా ఫీల్డులోకి ఎందుకురా నాయనా’... అనే మాటా సహజమే!
మాధవపెద్ది సురేశ్ జీవితంలో...
ఈ రెండు సహజాల దగ్గరా కొంత ఘర్షణ జరిగింది.
సురేశ్... సంగీత దర్శకుడయ్యారు!
పిల్లల్ని కూడా సంగీత సరస్వతి ఒడికే చేరుస్తాడనుకుంటే...
తనలా వద్దని, నాలుగు రాళ్లొచ్చే చదువులు చదివించాడు!
తరానికీ, తరానికీ మధ్య...
అభిరుచుల్లో, అభిప్రాయాల్లో, అవసరాలలో
ప్రాధాన్యతలు మారుతున్నప్పుడు...
పిల్లల కోసం తల్లిదండ్రులు తమను తాము శ్రుతి చేసుకోక తప్పదు.
సురేశ్, నిర్మల సవరించుకున్న
శ్రుతులు, గతులే... ఈవారం ‘లాలిపాఠం’.
మాధవపెద్ది వారి ఇల్లంటే సంగీత నిలయమే. వాకిళ్లు కూడా సరిగమలు పలుకుతున్నాయేమో అన్నట్లు ఉంటుంది ఇంటి వాతావరణం. ఈ ఇంటి పిల్లలంటే ‘శ్రుతిలయ’లే అనుకోవడం సహజమే. కానీ ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేశ్ మాత్రం తన పిల్లలను ఆధునిక సాంకేతిక రంగం వైపు నడిపించారు. ‘‘మాకు ఇద్దరు పిల్లలు. పిల్లల్లోని నైపుణ్యాన్ని గుర్తించడంలో మా నాన్న నిష్ణాతులు. ఆయన నాకు, మా అన్నయ్యకు చదువు ఒంటపట్టదని, సంగీతమే వీళ్లలోకం అని గ్రహించారు. అలాగే సంగీతసాధన వైపు ప్రోత్సహించారు.
ఇక మా అబ్బాయికి ఆరవ తరగతిలోనే పియానో ఫస్ట్ గ్రేడ్ అయింది. కానీ నేను నా పిల్లలను చదువు వైపే ప్రోత్సహించాను. ఎందుకంటే మా నాన్నగారికి తాను ఇంజినీరింగ్ చేయాలనే కోరిక ఉన్నప్పటికీ డిప్లమోతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన కోరికను నేనూ తీర్చలేకపోయాను, ‘నువ్వు ఇంజినీర్‌వి కావచ్చు కదా’ అని మా అబ్బాయితో చెప్పాను. నిజానికి మా పిల్లల్ని చదువుల వైపు పంపించడానికి సహేతుకమైన కారణమే ఉంది.
ఈ రంగంలో రాబడి కచ్చితంగా ఇంత అనే స్పష్టత ఉండదు. ఉద్యోగంలో అయితే జీవితానికి భద్రత ఉంటుంది. అలాగే సమాజంలో చదువుకున్న వారికి ఉండే గౌరవం చదువుకోని వారికి ఉండకపోవడాన్ని నేను స్వయంగా గమనించాను. అప్పటికి నేను చూసిన ప్రపంచం దృష్ట్యా పిల్లల్ని చదివించాలని గట్టిగా భావించాను’’ అన్నారు.
పద్నాలుగేళ్లు రోజూ క్యారియర్‌తో...
‘‘మా పిల్లలు పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అక్కడే చదివారు. పిల్లల్ని చక్కగా చదివించాలనే కోరిక మాకు ఎక్కువగా ఉండేది. తెల్లవారుజామునే మా వారికి కావల్సినవి అమర్చి పెట్టి, పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపి, ఆ తర్వాత వంట చేసి పిల్లలకు క్యారియర్ తీసుకెళ్లేదాన్ని. అలా ఎల్కేజీ నుంచి పన్నెండవ తరగతి వరకు రోజూ క్యారియర్ తీసుకెళ్లాను.
ఐదవ తరగతి వరకు పిల్లలకు నేనే ట్యూషన్ చెప్పాను. ఆ తర్వాత బయట ట్యూషన్లు పెట్టాం. టెన్త్ క్లాస్ నుంచి ట్యుటోరియల్స్‌లో కోచింగ్ ఇప్పించాం. చెన్నైలో స్కూల్లో తెలుగు చదివించలేదు కానీ మా పిల్లలు ఇంట్లో మా అత్తగారు, అమ్మ దగ్గర పద్యాలు, శ్లోకాలు నేర్చుకున్నారు. నేను చదివింది టెన్త్ క్లాస్ వరకే. ఉన్నత విద్య గురించి పెద్దగా తెలిసేది కాదు.
దాంతో ఏ కోర్సు చదివితే భవిష్యత్తు బావుంటుందని చదువుకున్న వాళ్లందరినీ అడిగేదాన్ని. అలా తెలుసుకున్న సమాచారంతోనే బీటెక్‌లో చాలామంది కంప్యూటర్ సైన్స్ చదువుతున్న రోజుల్లో మా అబ్బాయిని ఈసీఈ చదివించాం. ఎక్కువ మంది ఎం.ఎస్కి అమెరికా వెళ్తున్న సమయంలో మా అబ్బాయిని ఆస్ట్రేలియా పంపించాం. పాపని సి.ఎ చదివించాలని మావారి కోరిక. అయితే ఆమె మల్టీమీడియా మీద ఆసక్తి చూపించడంతో అదే చదివించాం’’ అని చెప్పారు నిర్మల.
బైక్ నడపడం కూడా!
‘‘పిల్లల విషయంలో తను చాలా జాగ్రత్తలు తీసుకునేది! మా అబ్బాయికి బీటెక్ సీటు దిండిగల్‌లో వచ్చింది. హాస్టల్ వాతావరణం బాగాలేదని మరో నలుగురు పిల్లలతో మా అబ్బాయిని అద్దెరూములో పెట్టింది. ఆ ఇంటి వాతావరణం, పరిసరాలను కూడా అధ్యయనం చేసి మరీ గదిని అద్దెకు తీసుకుంది’’ అని సురేశ్ చెప్తుండగా నిర్మల జోక్యం చేసుకుంటూ ‘‘మరి వీరేమో ప్రొఫెషన్లో బిజీ. కాలేజ్‌లో చేర్చాల్సిన రోజు కూడా రికార్డింగ్ ఉండడంతో రాలేకపోయారు. ఆ కాలేజ్‌లో ఇంజినీరింగ్‌లో చేరడానికి వచ్చిన విద్యార్థులందరికీ తోడుగా తండ్రులే వచ్చారు. తల్లిని మాత్రమే వెళ్లి చేర్చి వచ్చింది నేనొక్కర్తినే. తల్లి చేయాల్సిన పనులే కాకుండా తండ్రి చేయాల్సిన పనులకూ నేనే ముందు ఉండాల్సి వచ్చేది. పైగా పిల్లాడికి టూవీలర్ నడపడం కూడా నేనే నేర్పించాను’’ అన్నారామె.
పిల్లలే జీవితం!
‘‘పిల్లల బాధ్యతతోపాటు వాళ్ల సరదాలు తీర్చడం కూడా ఎక్కువగా ఈవిడే చూసుకున్నది. మా అబ్బాయికి క్రికెట్ ఇష్టం. తల్లీపిల్లలు టెస్ట్ మ్యాచ్‌లకు కూడా వెళ్లిపోయేవారు. వస్తూ వస్తూ కపిల్‌దేవ్ బొమ్మ ముద్రించిన బనియన్లు, బ్యాట్లు వంటివేవో కొనుక్కొచ్చేవారు. పాండిబజార్‌కు తీసుకెళ్లి షాపింగ్ చేయడం అప్పట్లో మా వినోదం. మా కుటుంబం ఇప్పుడిలా పరిపూర్ణంగా ఉందంటే అందులో మా చిట్టి (నిర్మలని ఆయన ఆలాగే పిలుస్తారు) సర్దుబాట్లు చాలానే ఉన్నాయి, పిల్లలే జీవితం అన్నట్లు ఉండేది. పిల్లలకు సంగీతాన్ని వృత్తిగా తీసుకోవడానికి ప్రోత్సహించలేదు కానీ సంగీత జ్ఞానం, కళాభిరుచి ఉండేటట్లు జాగ్రత్త పడింది. మా అమ్మాయిని నలభై ఏళ్ల నాటి పాట గురించి అడిగినా ఇట్టే చెప్పేస్తుంది. ఇప్పుడు మా మనుమరాలితో కలిసి మా అమ్మాయి కూచిపూడి నాట్యం నేర్చుకుంటోంది’’ అన్నారాయన.
జీవితమైనా... సినిమా అయినా!
పిల్లలకు ప్రణాళికబద్ధంగా జీవించడం నేర్పించానంటారు మాధవపెద్ది. ‘‘సినిమా అయినా, జీవితం అయినా మొదటి సగం కంటే రెండవ సగం బాగుండాలి. అందుకు చక్కటి ప్రణాళిక ఉండాలి. మాకు కారు, డ్రైవరు ఉన్న రోజుల్లో కూడా పిల్లలకు డబ్బు విలువ తెలియాలని స్కూలుకి రూట్బస్లో పంపించాం. డబ్బు ఉంటే ఉన్నట్లు జీవించాలి, లేకపోతే లేనట్లే జీవించాలి. అప్పుడే జీవితానికి హాయి. డబ్బు ఉండి ఖర్చు చేయకపోతే అది పిసినిగొట్టు తనం, డబ్బు లేకపోయినా మరెవరిలాగానో ఆడంబరంగా జీవించాలనుకోవడం భేషజాల జీవితం. ఇవి రెండూ సరికాదని చెప్పేవాడిని. ఎవరైనా సరే ఆత్మసంతృప్తితో జీవించడం అలవాటు చేసుకోవాలి. డబ్బుసంపాదనలో పడి ఆరోగ్యాన్ని, జీవితాన్ని కోల్పోవద్దు అని గుర్తు చేస్తుంటాను. నేను నేర్పిన సిద్ధాంతాల పరిధిలో మా పిల్లలిద్దరూ వాళ్ల జీవితాల్ని వాళ్లు చక్కగా జీవిస్తున్నారు’ అన్నారు సురేశ్ సంతోషంగా.
ఇప్పుడు అవకాశాలు విస్తృతమయ్యాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటూ పిల్లలు వాళ్ల ప్రపంచాన్ని విస్తరించుకుంటున్నారు. పిల్లలు ఎక్కడ ఉన్నా తమ కళ్ల ముందే ఉన్నట్లు భావించాలి తల్లిదండ్రులు. అలా పిల్లలతో టచ్‌లో ఉండడానికే ఫేస్బుక్ ఉపయోగించడం నేర్చుకున్నానన్నారు సురేశ్. వారి మాటలు వింటే ‘విజ్ఞానంతోపాటు మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోతే అవకాశాలనే కాదు అనుబంధాలకూ దూరమవుతాం. జీవితం నదిలా ప్రవహిస్తూనే ఉండాలి. కాలానుగుణంగా కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి’ అనిపించింది.
- వాకా మంజుల, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఇదీ కుటుంబం: మాధవపెద్ది సురేశ్‌చంద్ర, నిర్మల
అబ్బాయి: నాగసాయి శరత్చంద్ర, ‘కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా’లో ఉద్యోగం
కోడలు: రేణు రుక్మిణీదేవి, బిటెక్, సాఫ్ట్వేర్ ఉద్యోగి
మనుమళ్లు: నాగసాయి జయదేవ్, నాగసాయి సంహిత్
అమ్మాయి: నాగలక్ష్మి, బి.కామ్, మల్టీమీడియా గ్రాఫిక్స్, గృహిణి
అల్లుడు: పనీర్‌సెల్వం, చెన్నైలో వ్యాపారవేత్త
మనుమడు: నాగసాయి శ్యామసుందర్ మనుమరాలు: తపస్విని
మాధవపెద్ది సురేశ్ సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో కొన్ని:
శ్రీకృష్ణార్జున విజయం
భైరవద్వీపం
మేడమ్
బృందావనం
మాతో పెట్టుకోకు