మంచి సినిమాతో సంగీత దర్శకురాలిగా నా ప్రయాణం మొదలుపెడతా... | Singer Kausalya Interview | Sakshi
Sakshi News home page

మంచి సినిమాతో సంగీత దర్శకురాలిగా నా ప్రయాణం మొదలుపెడతా...

Published Fri, Aug 8 2014 12:09 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

మంచి సినిమాతో సంగీత దర్శకురాలిగా నా ప్రయాణం మొదలుపెడతా... - Sakshi

మంచి సినిమాతో సంగీత దర్శకురాలిగా నా ప్రయాణం మొదలుపెడతా...

గానం, బుల్లితెర సంగీత దర్శకత్వం, అనువాద కళ... ఇలా అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసిన కళాకారిణి కౌసల్య. శాస్త్రీయం, పాశ్చాత్యం...ఇలా ఏ విధమైన సంగీతమైనా ఆమె గాత్రం నుంచిజాలువారేటప్పుడు కొత్త సొబగును సంతరించుకుంటుంది. ఓ విధమైన హస్కీ వాయిస్‌తో దాదాపు  దశాబ్దమున్నరగా యువతరం శ్రోతల్ని ఉర్రూతలూగిస్తున్ననేడు కౌసల్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’ జరిపిన ఇంటర్‌వ్యూ.
 
 ఈ పుట్టిన రోజు ప్రత్యేకత ఏంటండీ?
 సినిమాల్లో విరివిగా పాడుతున్నా... ఒక గాయనిగా సంతృప్తి లేదు. ఇంకా ఏదో చేయాలి. అందుకే.. ప్రైవేటు ఆల్బమ్స్ కంపోజ్ చేసి, నన్ను నేను నిరూపించుకోవాలనే పనిలో ఉన్నాను. త్వరలో ప్రారంభం కానున్న ఓ ప్రైవేటు ఛానల్ కోసం ఇటీవలే ఓ పాటను కంపోజ్ చేశాను. దానికి మంచి స్పందన వస్తోంది. ఇక ప్రస్తుతం పాడుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి.
 
 ఓ వైపు గానం, సంగీత దర్శకత్వం, ఇంకో వైపు డబ్బింగ్, బుల్లితెర కార్యక్రమాలకు జడ్జ్, మరోవైపు దేశ విదేశాల్లో పాట కచ్చేరీలు... వీటన్నిటికీ సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు?
 నేను చిన్నప్పట్నుంచీ అంతే. వర్క్ హాలిక్. ఖాళీగా ఉండటం తెలీదు. ఒక వేళ సమయం చిక్కితే, పాటల్ని వినడమో, లేక కంపోజింగ్ చేసుకోవడమో ఏదో ఒకటి చేస్తుంటాను. అందుకే నా దైనందిన జీవితం ఎంత బిజీగా ఉన్నా, నాకు మాత్రం అలసట అనిపించదు.
 
 చిన్నప్పుడు పాటల పోటీల్లో ఏమైనా పాల్గొన్నారా?
 లెక్కలేననన్ని. స్కూల్లో జరిగే ప్రతి వేడుకలోనూ నాతో పాడించేవారు. స్కూల్ తరఫున పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు తెచ్చాను. అప్పుడే ఓ విధంగా నేను సెలబ్రిటీ హోదా అనుభవించా. నేను ఎన్‌సీసీలో ఉన్నప్పుడు 16 రాష్ట్రాలకు సంబంధించిన పాటల పోటీలను నిర్వహిస్తే... అందరిలో ఫస్ట్ వచ్చాను. ఆ సందర్భంలో చాలా మంది నన్ను ‘జూనియర్ లత’ అని అభినందిస్తుంటే చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించాను.
 
 శాస్త్రీయ సంగీతం ఎంత వరకు నేర్చుకున్నారు?
 ఎం.ఎ మ్యూజిక్ చేశాను. కర్ణాటక సంగీతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. తిరుపతిలో నగర సంకీర్తనం, బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సమక్షంలో పాడటం నా జీవితంలో మరచిపోలేని క్షణాలు. తిరుపతి సిస్టర్స్ పేరుతో నా చెల్లి సుధ, నేను కలిసి ఎన్నో కచ్చేరీలు చేశాం.
 
 సినిమాల్లో తొలి అవకాశం ఎలా వచ్చింది?
 ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో ఫైనల్ విన్నర్‌ని అయ్యాక, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ నాతో ఓ యాడ్‌కి పాట పాడించారు. తర్వాత ఆయనే... ‘నీ కోసం’ సినిమాలో టైటిల్ సాంగ్‌లో హమ్మింగ్ అనిపించారు. ‘చిత్రం’ కోసం ఆర్పీగారి సంగీత దర్శకత్వంలోనే నేను పాడిన ‘ఏకాంత వేళ...’ పాట నా కెరీర్‌కి పెద్ద బ్రేక్‌గా నిలిచింది. తర్వాత మణిశర్మ సంగీత దర్శకత్వంలో ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా కోసం పాడిన ‘నీ కొప్పులో నా మల్లె తోట..’పాట కూడా నాకు మంచి పేరు తెచ్చింది.
 
 చక్రి సంగీతంలో ఎక్కువ సినిమాలు పాడినట్లున్నారు?
 అవును.. నా ఎక్కువ హిట్ సాంగ్స్ చక్రిగారివే. ఆయన పాటల్లో హై పిచ్ ఎక్కువగా ఉంటుంది. నేను హై పిచ్ బాగా పాడగలను. అందుకే నాతో ఎక్కువ పాటలు పాడించారాయన. ముఖ్యంగా ‘ఇడియట్’ సినిమాకోసం చక్రిగారు నాతో పాడించిన ‘ఈ రోజే తెలిసింది... నీలో దాగిన ప్రేమ’ పాటైతే... ఆల్‌టైమ్ హిట్. నేను ఎక్కడికెళ్లినా ఆ పాట గురించే చెబుతారు.
 
 సంగీత దర్శకత్వం చేయాలనే ఆలోచన మొదట్నుంచీ ఉండేదా?
 ఎం.ఏ మ్యూజిక్ చేస్తున్నప్పుడే పాటల్ని కంపోజ్ చేసేదాన్ని. ‘భార్యామణి’ టీవీ సీరియల్ టైటిల్ సాంగ్‌తో నా స్వరసారథ్యం మొదలైంది. 2011 తానా మహాసభల కోసం ఓ పాటను క్లాసికల్, వెస్ట్రన్ మిక్స్ చేసి రూపొందించాను. దానికి అద్భుతమైన స్పందన లభించింది. ఇక ‘ఆడదే ఆధారం’ సీరియల్ సాంగ్ నాకు ఎక్కడ లేని గుర్తింపు తెచ్చింది. సినిమాలకు కూడా స్వరాలందించాలని ఉంది. చాలామంది అడిగారు కూడా. అయితే... ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడం నాకు ఇష్టం లేదు. మంచి సినిమాతో నా ప్రయాణం మొదలుపెడతా.
 
 డబ్బింగ్ కూడా చెప్పినట్లున్నారు?
 అవును. శ్రావణమాసం, బకరా... ఇలా కొన్ని సినిమాల్లో కథానాయికలకు డబ్బింగ్ చెప్పా. ‘శ్రావణమాసం’ సినిమాలో కల్యాణి పాత్రకు తెలంగాణ యాసలో నేను చెప్పిన డబ్బింగ్ నాకు మంచి పేరు తెచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement