ఇష్టంతో కష్టపడితే రాణింపు సాధ్యం
సినీ గాయని కౌసల్య
వీరవాసరం : ఇష్టంతో కష్టపడితే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని ప్రముఖ సినీ గాయని కౌసల్య అన్నారు. వీరవాసరం మండలం తోకలపూడిలో జరుగుతున్న వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సినీ సంగీత విభావరికి హాజరైన కౌసల్య బుధవారం రాత్రి ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
► మాది గుంటూరు. నాన్న ప్రభుత్వ కార్యాలయంలో యూడీసీ.
► చిన్నప్పటి నుంచి పాటలంటే చెవికోసుకునేదాన్ని. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో సంగీతంలో పీజీ చేశాను.
► స్కూల్ స్థాయిలోనే ఎన్నో పాటలు పాడి అవార్డులు అందుకున్నాను. 1999లో ఆర్పీ పట్నాయక్ సంగీత సారథ్యంలో మీకోసం సినిమాలో తొలిసారి పాడాను.
► చిత్రం, ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఆడదే ఆధారం, గోపిగోపిక గోదావరి, అమ్మనాన్న తమిళమ్మాయి, గంగోత్రి, శివమణి, కబడ్డీ కబడ్డీ, నువ్వే నువ్వే, డిక్టేటర్ చిత్రాలు మంచి పేరు తీసుకువ చ్చాయి.
► తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఇప్పటివరకూ 500 పైగా పాటలు పాడాను. అనేక ప్రైవేట్ ఆల్బమ్స్‌లోనూ గొంతు కలిపాను.
► డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా శ్రావణ మాసం, బకరా చిత్రాల్లో హీరోయిన్లకు గాత్రదానం చేశాను.
► సత్యభామ చిత్రంలోని ‘గుండెలోన..’ పాటకు 2007లో నంది అవార్డు తీసుకున్నాను. ఆడదే ఆధారం తెలుగు సీరియల్ టైటిల్ సాంగ్‌కు 2011లో మరోసారి నంది అవార్డు అందుకున్నాను.
► 2003లో అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, 2006లో శివమణి , 2009లో గోపి గోపిక గోదావరి చిత్రాల్లో బెస్ట్ ఫిమేల్ సింగర్‌గా ఉగాది పురస్కారాలను పొందాను.
► ప్రజల హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోయే పాటలు పాడడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను.