Singer Kausalya
-
తన కోసం అన్ని భరించా.. కానీ పెళ్లి చేసుకోమంటున్నాడు: కౌసల్య
సింగర్ కౌసల్య తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి దర్శకత్వంలో అత్యధికంగా పాటలు పాడిందామె. 1999 తెలుగు సినిమా నీ కోసం చిత్రంలో తొలిసారిగా ఆలపించారు కౌసల్య. ఆ తర్వాత తెలుగులో దాదాపు 350కి పైగా పాటలను పాడారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు అయితే కెరీర్ సవ్యంగా సాగుతున్న సమయంలో ఆమె జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. పెళ్లయ్యాక కౌసల్య జీవితం అనేక మలుపులు తిరిగింది. ఆమె వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నో ఒడిదుడికుల మధ్య ఆమె జీవితం సాగింది. చాలా సార్లు తన భర్త తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌసల్య జీవితంలో ఎదురైన సమస్యలను ప్రస్తావించారు. బాబు కోసం భరించా కౌసల్య మాట్లాడుతూ..' వైవాహిక జీవితంలో చాలా బాధలు అనుభవించా. ఆ బాధను నాలోనే దాచుకునేదాన్ని. తన బాబు చాలా చిన్న పిల్లవాడు కావడంతో వాడి కోసమే అన్నింటిని దిగమింగా. కానీ అప్పుడప్పుడు నా చెల్లితో చెప్పుకునేదాన్ని. అలాగే అమ్మ దగ్గరా ఏమీ దాచేదాన్ని కాదు. తన భర్త మరో పెళ్లి చేసుకోవాలనుకునే వరకు సర్దుకు పోదామని ఓపికగా ప్రయత్నించా. కానీ కుదరలేదు. చివరికీ ఆయన మరొకరిని పెళ్లి చేసుకుని విడిపోయారు.' అని అన్నారు. ఆ తర్వాత తన కుమారుడి గురించి ప్రస్తావిస్తూ..' ప్రస్తుతం బాబు పెద్దవాడు అయ్యాడు. వాడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కానీ వాడేమో తనను మళ్లీ పెళ్లి చేసుకోమని అంటున్నాడు. నా జీవితంలో సంతోషం చూడాలన్నదే వాడి కోరిక. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే పెంచి పెద్ద చేసింది. ఎనిమిదేళ్ల క్రితం ఆమె కూడా చనిపోయారు. ఇప్పుడు నా కొడుకే లోకం .. నా పాటకి మంచి గుర్తింపు వస్తే ముందుగా సంతోషపడేది బాబే.' అని అన్నారు -
ఇష్టంతో కష్టపడితే రాణింపు సాధ్యం
సినీ గాయని కౌసల్య వీరవాసరం : ఇష్టంతో కష్టపడితే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని ప్రముఖ సినీ గాయని కౌసల్య అన్నారు. వీరవాసరం మండలం తోకలపూడిలో జరుగుతున్న వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సినీ సంగీత విభావరికి హాజరైన కౌసల్య బుధవారం రాత్రి ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ► మాది గుంటూరు. నాన్న ప్రభుత్వ కార్యాలయంలో యూడీసీ. ► చిన్నప్పటి నుంచి పాటలంటే చెవికోసుకునేదాన్ని. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో సంగీతంలో పీజీ చేశాను. ► స్కూల్ స్థాయిలోనే ఎన్నో పాటలు పాడి అవార్డులు అందుకున్నాను. 1999లో ఆర్పీ పట్నాయక్ సంగీత సారథ్యంలో మీకోసం సినిమాలో తొలిసారి పాడాను. ► చిత్రం, ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఆడదే ఆధారం, గోపిగోపిక గోదావరి, అమ్మనాన్న తమిళమ్మాయి, గంగోత్రి, శివమణి, కబడ్డీ కబడ్డీ, నువ్వే నువ్వే, డిక్టేటర్ చిత్రాలు మంచి పేరు తీసుకువ చ్చాయి. ► తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఇప్పటివరకూ 500 పైగా పాటలు పాడాను. అనేక ప్రైవేట్ ఆల్బమ్స్‌లోనూ గొంతు కలిపాను. ► డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా శ్రావణ మాసం, బకరా చిత్రాల్లో హీరోయిన్లకు గాత్రదానం చేశాను. ► సత్యభామ చిత్రంలోని ‘గుండెలోన..’ పాటకు 2007లో నంది అవార్డు తీసుకున్నాను. ఆడదే ఆధారం తెలుగు సీరియల్ టైటిల్ సాంగ్‌కు 2011లో మరోసారి నంది అవార్డు అందుకున్నాను. ► 2003లో అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, 2006లో శివమణి , 2009లో గోపి గోపిక గోదావరి చిత్రాల్లో బెస్ట్ ఫిమేల్ సింగర్‌గా ఉగాది పురస్కారాలను పొందాను. ► ప్రజల హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోయే పాటలు పాడడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. -
మంచి సినిమాతో సంగీత దర్శకురాలిగా నా ప్రయాణం మొదలుపెడతా...
గానం, బుల్లితెర సంగీత దర్శకత్వం, అనువాద కళ... ఇలా అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసిన కళాకారిణి కౌసల్య. శాస్త్రీయం, పాశ్చాత్యం...ఇలా ఏ విధమైన సంగీతమైనా ఆమె గాత్రం నుంచిజాలువారేటప్పుడు కొత్త సొబగును సంతరించుకుంటుంది. ఓ విధమైన హస్కీ వాయిస్‌తో దాదాపు దశాబ్దమున్నరగా యువతరం శ్రోతల్ని ఉర్రూతలూగిస్తున్ననేడు కౌసల్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ. ఈ పుట్టిన రోజు ప్రత్యేకత ఏంటండీ? సినిమాల్లో విరివిగా పాడుతున్నా... ఒక గాయనిగా సంతృప్తి లేదు. ఇంకా ఏదో చేయాలి. అందుకే.. ప్రైవేటు ఆల్బమ్స్ కంపోజ్ చేసి, నన్ను నేను నిరూపించుకోవాలనే పనిలో ఉన్నాను. త్వరలో ప్రారంభం కానున్న ఓ ప్రైవేటు ఛానల్ కోసం ఇటీవలే ఓ పాటను కంపోజ్ చేశాను. దానికి మంచి స్పందన వస్తోంది. ఇక ప్రస్తుతం పాడుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఓ వైపు గానం, సంగీత దర్శకత్వం, ఇంకో వైపు డబ్బింగ్, బుల్లితెర కార్యక్రమాలకు జడ్జ్, మరోవైపు దేశ విదేశాల్లో పాట కచ్చేరీలు... వీటన్నిటికీ సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు? నేను చిన్నప్పట్నుంచీ అంతే. వర్క్ హాలిక్. ఖాళీగా ఉండటం తెలీదు. ఒక వేళ సమయం చిక్కితే, పాటల్ని వినడమో, లేక కంపోజింగ్ చేసుకోవడమో ఏదో ఒకటి చేస్తుంటాను. అందుకే నా దైనందిన జీవితం ఎంత బిజీగా ఉన్నా, నాకు మాత్రం అలసట అనిపించదు. చిన్నప్పుడు పాటల పోటీల్లో ఏమైనా పాల్గొన్నారా? లెక్కలేననన్ని. స్కూల్లో జరిగే ప్రతి వేడుకలోనూ నాతో పాడించేవారు. స్కూల్ తరఫున పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు తెచ్చాను. అప్పుడే ఓ విధంగా నేను సెలబ్రిటీ హోదా అనుభవించా. నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు 16 రాష్ట్రాలకు సంబంధించిన పాటల పోటీలను నిర్వహిస్తే... అందరిలో ఫస్ట్ వచ్చాను. ఆ సందర్భంలో చాలా మంది నన్ను ‘జూనియర్ లత’ అని అభినందిస్తుంటే చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించాను. శాస్త్రీయ సంగీతం ఎంత వరకు నేర్చుకున్నారు? ఎం.ఎ మ్యూజిక్ చేశాను. కర్ణాటక సంగీతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. తిరుపతిలో నగర సంకీర్తనం, బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సమక్షంలో పాడటం నా జీవితంలో మరచిపోలేని క్షణాలు. తిరుపతి సిస్టర్స్ పేరుతో నా చెల్లి సుధ, నేను కలిసి ఎన్నో కచ్చేరీలు చేశాం. సినిమాల్లో తొలి అవకాశం ఎలా వచ్చింది? ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో ఫైనల్ విన్నర్‌ని అయ్యాక, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ నాతో ఓ యాడ్‌కి పాట పాడించారు. తర్వాత ఆయనే... ‘నీ కోసం’ సినిమాలో టైటిల్ సాంగ్‌లో హమ్మింగ్ అనిపించారు. ‘చిత్రం’ కోసం ఆర్పీగారి సంగీత దర్శకత్వంలోనే నేను పాడిన ‘ఏకాంత వేళ...’ పాట నా కెరీర్‌కి పెద్ద బ్రేక్‌గా నిలిచింది. తర్వాత మణిశర్మ సంగీత దర్శకత్వంలో ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా కోసం పాడిన ‘నీ కొప్పులో నా మల్లె తోట..’పాట కూడా నాకు మంచి పేరు తెచ్చింది. చక్రి సంగీతంలో ఎక్కువ సినిమాలు పాడినట్లున్నారు? అవును.. నా ఎక్కువ హిట్ సాంగ్స్ చక్రిగారివే. ఆయన పాటల్లో హై పిచ్ ఎక్కువగా ఉంటుంది. నేను హై పిచ్ బాగా పాడగలను. అందుకే నాతో ఎక్కువ పాటలు పాడించారాయన. ముఖ్యంగా ‘ఇడియట్’ సినిమాకోసం చక్రిగారు నాతో పాడించిన ‘ఈ రోజే తెలిసింది... నీలో దాగిన ప్రేమ’ పాటైతే... ఆల్‌టైమ్ హిట్. నేను ఎక్కడికెళ్లినా ఆ పాట గురించే చెబుతారు. సంగీత దర్శకత్వం చేయాలనే ఆలోచన మొదట్నుంచీ ఉండేదా? ఎం.ఏ మ్యూజిక్ చేస్తున్నప్పుడే పాటల్ని కంపోజ్ చేసేదాన్ని. ‘భార్యామణి’ టీవీ సీరియల్ టైటిల్ సాంగ్‌తో నా స్వరసారథ్యం మొదలైంది. 2011 తానా మహాసభల కోసం ఓ పాటను క్లాసికల్, వెస్ట్రన్ మిక్స్ చేసి రూపొందించాను. దానికి అద్భుతమైన స్పందన లభించింది. ఇక ‘ఆడదే ఆధారం’ సీరియల్ సాంగ్ నాకు ఎక్కడ లేని గుర్తింపు తెచ్చింది. సినిమాలకు కూడా స్వరాలందించాలని ఉంది. చాలామంది అడిగారు కూడా. అయితే... ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడం నాకు ఇష్టం లేదు. మంచి సినిమాతో నా ప్రయాణం మొదలుపెడతా. డబ్బింగ్ కూడా చెప్పినట్లున్నారు? అవును. శ్రావణమాసం, బకరా... ఇలా కొన్ని సినిమాల్లో కథానాయికలకు డబ్బింగ్ చెప్పా. ‘శ్రావణమాసం’ సినిమాలో కల్యాణి పాత్రకు తెలంగాణ యాసలో నేను చెప్పిన డబ్బింగ్ నాకు మంచి పేరు తెచ్చింది.