క్రికెటర్లుగా మారిన సినీతారలు.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉందండోయ్!
ఆటకు వేళాయె అంటూ కొందరు స్టార్స్ ప్లేయర్స్‌గా మారారు. క్రికెటర్లుగా, కోచ్‌లుగా మౌల్డ్ అయిపోయారు. అయితే ఈ ఆట అంతా సినిమాల కోసమే. ప్రస్తుతం క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. కొన్ని కాల్పనిక కథలు కాగా, కొన్ని బయోపిక్స్ కూడా ఉన్నాయి. ఇక వెండితెరపై క్రికెటర్లుగా అలరించనున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం.
► సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహణ మీద ఉన్నారు. ‘లాల్ సలామ్’ చిత్రం కోసమే ఇదంతా. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో, రజనీకాంత్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ క్రికెట్ కోచ్ పాత్రలో కనిపిస్తారనీ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా కనిపిస్తారనీ ప్రచారం జరుగుతోంది. మరి.. రజనీ ఏ పాత్రలో
కనిపిస్తారో చూడాలి. ‘లాల్ సలామ్’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.
► క్రికెట్ గ్రౌండ్లో బిజీగా ఉంటున్నారు మాధవన్, సిద్ధార్థ్, నయనతార. ఈ ముగ్గురూ కలిసి సిల్వర్ స్క్రీన్‌పై ఆడనున్న మ్యాచ్ ‘ది టెస్ట్’. తమిళ నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో నయనతార, మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో
విడుదల కానుంది.
► శ్రీలంక మాజీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంలో సలీమ్ మాలిక్ పాత్ర చేసిన మధుర్ మిట్టల్ ఈ చిత్రంలో మురళీధరన్ పాత్ర చేస్తున్నారు. ముత్తయ్య భార్య మదిమలర్ పాత్రను మహిమా నంబియార్ చేస్తున్నారు. ‘‘మురళీధరన్ జీవితంలోని పలు కోణాలను ఈ చిత్రంతో వెండితెరపై ఆవిష్కరించనున్నాం. 800 వికెట్లు తీసిన ఏకైక ఆఫ్ స్పిన్ బౌలర్‌గా మురళీధరన్ పేరిట రికార్డు ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
► భారత ప్రముఖ మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందిన వెబ్ మూవీ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’. ఇందులో జులన్ గోస్వామిగా అనుష్కా శర్మ నటించారు. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం
వహించిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. పశ్చిమ బెంగాల్ చక్దా ప్రాంతానికి చెందిన జులన్ గోస్వామి దాదాపు రెండు దశాబ్దాలు మహిళా క్రికెటర్‌గా, కెప్టెన్‌గా సక్సెస్ఫుల్ కెరీర్‌ను లీడ్ చేశారు. ఉమెన్స్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జులన్ రికార్డు సాధించారు.
► యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ సైతం క్రికెట్ బ్యాట్ పట్టారు. ‘మిస్టర్ అండ్ మిస్ట్రస్ మహి’ సినిమాలో జాన్వీ కపూర్ క్రికెటర్‌గా నటిస్తున్నారు. రాజ్‌కుమార్ రావ్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. రియల్ క్రికెటర్స్ దగ్గర శిక్షణ తీసుకుని జాన్వీ కపూర్ ఈ సినిమా చేశారు. వీరితోపాటు మరికొందరు క్రికెటర్ల బయోపిక్‌లు, క్రికెట్ ఆధారంగా సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి.