ఎన్ఐఏతో విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిపై దాడి, విగ్రహ ధ్వంసంపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు విభాగానికి (ఎన్ఐఏ) అప్పగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, డీజీపీ జితేందర్‌కు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరలోని ఓ హోటల్లో దేశ వ్యతిరేక శక్తులు, దాడులకు పాల్పడిన వారు నెలల తరబడి జరిపిన అక్రమ కార్యకలాపాలపై నివేదిక తెప్పించుకోవాలని గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో మూడునెలలుగా దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరారు. సోమవారం ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు, డీజీపీ కార్యాలయంలో వేర్వేరుగా ఎంపీలు ఈటల రాజేందర్,ఎం.రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, రాకేష్‌రెడ్డి, నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ తదితరులు వినతిపత్రాలు సమరి్పంచిన వారిలో ఉన్నారు. హిందువులపై కేసులు పెడుతున్నారు : ఈటల రాజ్‌భవన్ వద్ద ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ హిందువులపైనే కేసులు పెడుతున్నారు..ఆత్మగౌరవాన్ని కించపరిస్తే క్షమించేది లేదు అని సీఎంను హెచ్చరించారు. ‘హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే నిందితుడిని పిచ్చోడు అని ముద్ర వేసి వదిలేసే ప్రయత్నం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గవర్నర్‌ను కోరాం’ అని ఈటల తెలిపారు. హిందూ దేవాలయాలపై దాడి జరిగినా సీఎం ఖండించలేదు : ఏలేటి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే సీఎం రేవంత్ ఇంతవరకు ఖండించలేదన్నారు. ‘నిందితుల మీద ప్రభుత్వం కేసు పెట్టకుండా ఏం చేస్తోంది? నగరంలో దాడులకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? దేవాలయాల మీద దాడి.. మా తల్లి మీద దాడిలా భావిస్తాం.. తిప్పికొడతా’ అని మహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. స్లీపర్ సెల్స్ ఏమైనా కుట్రలు చేస్తున్నాయా : రఘునందన్‌రావు డీజీపీ కార్యాలయం వద్ద ఎంపీ రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ ‘ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్‌పై పూర్తిస్థాయి విచారణ జరగాలి. సంఘ విద్రోహశక్తులు, స్లీపర్ సెల్స్ ఏమైనా కుట్రలు చేస్తున్నాయా అన్నది పరిశీలించాలి. ముత్యాలమ్మ టెంపుల్‌కు సమీపంలో స్లీపర్ సెల్స్‌కు శిక్షణ ఇచ్చారా? రాష్ట్రంలో 3 నెలల వ్యవధిలో 15 గుడులపై దాడుల వెనుక కుట్రకోణంపై విచారణ జరపాలి’ అని రఘునందన్ డిమాండ్ చేశారు.