'ముఫ్తీ రాజీనామా చేసి దిగిపోవాలి'
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వెంటనే పదవిలో నుంచి దిగిపోవాలని పీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముజఫర్ బేగ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కశ్మీర్లో పరిస్థితులు ఆమె నియంత్రించలేదని అనుకుంటే వెంటనే ఆ పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని అన్నారు. కశ్మీర్ ప్రజలకు న్యాయం చేస్తుందో లేదో అనే విషయాన్ని ఆమె లోతుగా ఓసారి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పారు.
ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో పరిస్థితులను నియంత్రించడంలో బీజేపీ, పీడీపీ భాగస్వామ్యం విఫలమైందనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నానని, అసలు తమ భాగస్వామ్యం పీడీపీ కోసం పనిచేయడం లేదని, తమ కార్యకర్తల కార్యకలాపాలు నియంత్రించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఓపక్క ప్రధాని నరేంద్రమోదీ కశ్మీర్ వికాసానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెబుతుంటే ఆయన పార్టీకి చెందిన నేతలు మాత్రం పూర్తిగా ఆ మాటల దూరం జరిగి విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.